
ఇప్పటికీ ఇసుక తిన్నెలే !
● ఆగస్టు వచ్చినా నిండని గోదావరి ● వర్షాకాలంలోనూ కనిపించని వరద ప్రభావం ● మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరని నీరు ● గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి..
బూర్గంపాడు: ఆగస్టు వస్తోందంటే గోదావరి వరదలు ఇళ్లు, పంటలను ముంచెత్తుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతుంటారు. ప్రతీ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు రావడం పరిపాటి. అలాంటిది ఈ ఏడాది నది నిండా కూడా నీరు ప్రవహించడం లేదు. ఇప్పటికీ భద్రాచలం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెలే కనిపిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు. మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఎగువనా వర్షాలు అంతంతే..
ప్రతి ఏటా గోదావరి వరదలు భద్రాచలం డివిజన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటల మునకతో పాటు ఇళ్లలోకీ వరద రావడంతో పలువురు నిరాశ్రయులవుతన్నారు. 2022లో వచ్చిన గోదావరి వరదలకు 10వేలకు పైగా ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. గత ఐదేళ్లుగా జూలైలోనే వరదలు వస్తుండగా ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద రాలేదు. జిల్లాతో పాటు గోదావరి బేసిన్‌లో ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరికి వరదలు వస్తాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసినా కొంతమేర వరద పెరుగుతుంది. ఇక ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, కిన్నెరసానికి కూడా వరదలు లేకపోవడంతో గోదావరి ఉధృతరూపం దాల్చలేదు.
అవసరాలు తీరేదెలా..
గోదావరిలో నీరు తక్కువగా ఉండగా, భవిష్యత్ అవసరాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు. జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలనే తాగునీరుగా అందిస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి జిల్లాలో సాగునీటి అవసరాలకూ ఈ నీరే ఆధారం. తాగు, సాగునీటితో పాటు జిల్లాలోని బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, సారపాక ఐటీసీ పీఎస్‌పీడీ మనుగడకు కూడా గోదావరి నీరే కీలకం. 2017లో గోదావరిలో నీటి లభ్యత తగ్గడంతో హెవీ వాటర్ ప్లాంట్ కొన్ని రోజులు మూతపడింది. ఈ ఏడాది ఇప్పుడే గోదావరిలో వరద తక్కువగా ఉండగా రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది రానట్టేనా..?
భద్రాచలంలో గోదావరి వరద 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతాయి. గత ఐదారేళ్లుగా గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక వరకు చేరుతూనే ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం మొదటి ప్రమాద హెచ్చరిక కూడా లేకపోవడం గమనార్హం. ఆగస్టు రెండో వారం వరకూ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ కాకపోవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద నానాటికీ తగ్గుతుండగా.. ఈ ఏడాది వరదలు రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది.