
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
హౌసింగ్ బోర్డు సెక్రటరీగా రామాలయ ఈఓ
భద్రాచలం : రామాలయ ఈఓ ఎల్.రమాదేవికి ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించిన విషయం విదితమే. ఆమెను ఆర్‌అండ్‌బీ శాఖకు కేటాయించినా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా మంగళవారం.. హౌసింగ్ శాఖలో సెక్రటరీ పోస్టు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఆమె హౌసింగ్ శాఖలో విధులు నిర్వర్తించనుండగా.. రామాలయ ఈఓగా మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు.
విద్యార్థుల భవిష్యత్‌కు
‘వ్యక్తిత్వ వికాసం’
అశ్వారావుపేట: విద్యార్థుల భవిష్యత్ కోసం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంగళవారం ఈ తరగతులు ప్రారంభించారు. మారుమూల ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం పొందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణ ఈ ఇగ్నైట్ అండ్ ఇన్‌స్పైర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఇన్‌స్పైర్ మైండ్స్ – ఇగ్నైటింగ్ సోల్స్ సంస్థ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగా, ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పీఓ, ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోటివేటివ్ స్పీకర్ జైపాల్, రంజిత్, సుధాకర్, రామ్, శ్రవణ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు కొంటే
బిల్లు తీసుకోవాలి
గుండాల: రైతులు ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు అన్నారు. మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కాలం చెల్లిన మందులు, నాసిరకం ఎరువులు విక్రయించవద్దని నిర్వాహకులకు సూచించారు. పీఏసీఎస్‌లో ఎరువుల నిల్వలను పరిశీలించి.. యూరియా సరిపడా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు. అనంతరం చెట్టుపల్లి, శంభూనిగూడెంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అర్హులంతా రైతుబీమా పథకానికి దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఓ వెంకటరమణ, ఏఈఓ లెనిన్, బాలరాజు ఉన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం