
శిశుమరణాలు నివారించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శిశు మరణాల నివారణకు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ప్రాణం అమూల్యమని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే శిశువుల ప్రాణాలు కాపాడొచ్చని అన్నారు. హైరిస్క్ గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణ, సమయానికి వైద్యసేవలు అందించాలని సూచించారు. గిరిజన, గుత్తికోయల ప్రాంతాల్లో పిల్ల ల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. శిశువులకు మొదటి ఆరునెలలు పూర్తిగా తల్లిపాలు అందించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు
చర్యలు చేపట్టాలి
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించాలి
కొత్తగూడెంఅర్బన్ : ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ప్రగతికి అనుకూల వాతావరణం నెలకొల్పడమే కాకుండా, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. యూనివర్సిటీ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా విస్తృతంగా ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు.
స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలి
చుంచుపల్లి: జిల్లాలో కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసి, వాటిలో పేదలకు అవకాశం కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంతో మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. వీరందరికీ చిరు వ్యాపారాలు, ఇతర మార్గాల్లో ఆర్థికంగా ప్రోత్సాహం కలిగిస్తామని అన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
పాల్వంచ: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా నీడనిచ్చే చెట్లు, వెదురు మొక్కలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు పెంచాలని సూచించారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌శర్మ, డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, ఆర్టీఓ వెంకటరమణ, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీఏఓ బాబురావు, మైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, ఎల్‌బీఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్