
అటవీ ఫలాలు దళారుల పాలు కావొద్దు
● ఖాళీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించాలి ● జీసీసీ చైర్మన్ తిరుపతి
పాల్వంచరూరల్ : అడవుల్లో గిరిజనలు సేకరించే ఫలాలు దళారుల పాలు కాకుండా నేరుగా జీసీసీ డీఆర్ డిపోలకే చేరేలా సిబ్బంది కృషిచేయాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) రాష్ట్ర చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. పాల్వంచ జీసీసీ బ్రాంచ్‌ను ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులు సేకరించిన అటవీ ఫలాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహిస్తే జీసీసీ డిపోలు లాభాల బాట పడతాయని అన్నారు. ఇప్ప పువ్వు, ఇప్పకాయలు సీజన్ ఉన్నప్పుడే అధికంగా సేకరించాలని సూచించారు. జీసీసీ ఖాళీ ప్రదేశాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ.. ఇప్పపువ్వు, ఇప్పబద్ధల ద్వారా నూనె తయారీకి గిరిజనులు ముందుకొస్తే ఐటీడీఏ ద్వారా నూనె తీసే యంత్రాలు అందిస్తామని చెప్పారు. జీసీసీ పరిధిలో నడుస్తున్న డీఆర్ డిపోలు చాలావరకు మరమ్మతులు నిర్వహించాల్సి ఉందన్నారు. పాల్వంచలో పెట్రోల్ పంపు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ఎన్‌ఓసీ రాకపోవడంతో పనులు నిలిచాయని తెలిపారు. డీఆర్ డిపోలు, పెట్రోల్ పంపు నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో జీసీసీ డీఎం సమ్మయ్య, మేనేజర్లు నర్సింహారావు, జయరాజ్, రాములు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
భద్రాచలంటౌన్: జీసీసీ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని జీసీసీ చైర్మన్ తిరుపతి స్పష్టం చేశారు. భద్రాచలంలోని జీసీసీ కార్యాలయం, గోడౌన్‌లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నత కోసం కృషి చేయాలని సూచించారు. జీసీసీ పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు, రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని చైర్మన్ ఆదేశించారు.