
22 తులాల బంగారం స్వాధీనం
● ఇద్దరు నిందితులు అరెస్ట్ ● భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
కొత్తగూడెంటౌన్: పోలీసులు భారీచోరీ కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించిన వివరాలు ఇలా.. రుద్రంపూర్ నాలేరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి వాకపల్లి వెంకటరమణ ఇంట్లో ఈ నెల 4న చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆదివారం ఫోర్ ఇంక్లైన్ ఏరియాలో సీఐ డి.ప్రతాప్, ఎస్సైలు కిషోర్, మనీషా, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన నారసాని రమేష్, కొత్తగూడెం మేదరబస్తీ గొల్ల గూడేనికి చెందిన ఓర్సు కుమార్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి విచారించగా సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 22 తులాల బంగారం, రూ.2,78,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నారసాని రమేష్ చోరీ కేసులోనే గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన టూటౌన్ పోలీసులకు, బ్యాక్‌గ్రౌండ్ సపోర్టు ఇచ్చిన సీసీఎస్ పోలీసులకు డీఎస్పీ రివార్డులను అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ ప్రతాప్, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు పాల్గొన్నారు.