
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రగతిమైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అన్ని శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, వేడుక ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని, ఆయా శాఖల పనితీరుకు అద్దం పట్టేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల్లో దేశభక్తి, జాతీయభావం ఉట్టిపడేలా ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రశంసాపత్రాలు అందించేలా గడువులోగా పేర్లు అందించాలని సూచించారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి
సహకరించాలి..
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ, అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతినెలా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ పార్టీలు బూత్‌లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే
పరిష్కరించాలి..
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. చుంచుపల్లి మండలానికి చెందిన కాకాటి అనూష.. ల్యాండ్ సర్వేయర్ అప్రెంటిస్ నిమిత్తం తనను ఆళ్లపల్లి మండలానికి కేటాయించారని, ఏడాది వయసున్న పాపతో అంతదూరం వెళ్లలేకపోతున్నానని, చుంచుపల్లి మండలానికి సమీపంలో కేటాయించాలని దరఖాస్తు చేయగా భూమి, కొలతల శాఖకు ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం అంగన్‌వాడీ స్కూల్ కాలనీలో బోరు చెడిపోయిందని, మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని ఫిర్యాదు చేయగా మిషన్ భగీరథ ఈఈకి ఎండార్స్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌శర్మ, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్లు ముజాహిద్, రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.