
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో
మంత్రి తుమ్మల
మణుగూరు టౌన్: రైతులకు చేరువలో ఉన్న డీసీసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరులో సోమవారం ఆయన డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సహకార సంస్థను కూడా కాపాడుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందేలా ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, బోనస్ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు అందించామని వివరించారు. పినపాక నియోజకవర్గంలో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ ప్రాంతంలో చెరువులు, రహదారులు అభివృద్ధి చేసే అవకాశం గతంలో తనకు లభించిందని అన్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే 25 – 30 వేల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పులుసుబొంత ప్రాజెక్ట్‌కు అటవీ అనుమతులు రాకపోవడంతోనే ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే సీఎంను కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, సీఈఓ వెంకట ఆదిత్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఏజీఎంఎస్ నవీన్‌కుమార్, చందర్‌రావు, డీసీఓ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ బాలరాజు, నాయకులు నవీన్, శివ, దొబ్బల వెంకటప్పయ్య, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు గాండ్ల సురేశ్, ఆవుల సర్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల సీపీఐ నేత అయోధ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.