
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
14న హుండీల లెక్కింపు
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ హుండీలను ఈనెల 14న లెక్కించనున్నట్లు ఈఓ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారు సకాలంలో హాజరు కావాలని కోరారు.
కేటీపీఎస్ ఉద్యోగికి డాక్టరేట్
పాల్వంచ: కేటీపీఎస్ ఉద్యోగి బూర్గుల విజయభాస్కర్ చేస్తున్న సంఘ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీస్తు సంపూర్ణత ఇవాంజలికల్ మిషన్ వారు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పిడుగు విజయ్‌కుమార్, సీనియర్ కన్సల్టెంట్ బి.మధు చేతుల మీదుగా విజయభాస్కర్ డాక్టరేట్ అందుకున్నారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ