
‘కేర్’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్థానిక కేసీఓఏ క్లబ్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో కొత్తగూడెం, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ యాజమాన్యాలు పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. కేర్ యాజమాన్యం వైద్యశిబిరం నిర్వహించడం హర్షణీయమన్నారు. భవిష్యత్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. డాక్టర్ సూర్యప్రకాశరావు వివిధ జిల్లాల్లో సేవలందించారని, బైపాస్ సర్జరీ లేకుండానే యువకుల్లో వంద శాతం బ్లాక్‌లను తొలగించడం వంటి చికిత్సలలో అగ్రగామిగా ఉన్నారని కొనియాడారు. దేశంలో ఐదువేల మందికి పైగా కార్డియాలజిస్టులకు శిక్షణ ఇవ్వడం ఆయన అనుభవానికి నిదర్శనమని అన్నారు. 2004 నుంచి 45 వేలకు పైగా ట్రాన్సరేడియల్ ప్రొసీజర్లను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. దేశంతో పాటు ఆసియా, ఫసిఫిక్ దేశాల్లోనూ వైద్య సేవలందిస్తున్నారని వివరించారు. గుండె జబ్బులపై అనేక పరిశోధనలు చేసి పలు అవార్డులు అందుకున్నారని అభినందించారు. కేర్ వైద్యులు వి.సూర్యప్రకాశరావు, కిరణ్‌కుమార్, శ్రీవాస్తవ్, రాహుల్, సాదత్ అహ్మద్, ఈషాసింగ్ ఉమర్, కాంతాలాల్‌షా వైద్య సేవలు అందించారు.