
ఘనంగా హయగ్రీవ జయంతి
● వేడుకగా ముగిసిన పవిత్రోత్సవాలు ● నేటి నుంచి నిత్యకల్యాణాలు పునఃప్రారంభం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం హయగ్రీవ జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న హయగ్రీవుని ఉపాలయంలో పండితులు వేదమంత్రాలు, భక్తజనాల శ్రీరామస్మరణల నడుమ హయగ్రీవునికి ఉదయం ప్రత్యేక స్నపనం, తిరుమంజనం జరిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు విజయరాఘవన్ చేతుల మీదుగా చిన్నారులకు పలకలు, సామగ్రి అందజేశారు. పవిత్రోత్సవాల ముగింపులో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి పూజలు నిర్వహించారు. కుంభప్రోక్షణ, పవిత్రావరోపణాలతో ఉత్సవ స్వస్తి పలికారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నిలిపివేసిన నిత్యకల్యాణాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వారాంతపు సెలవు రోజులు కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.