
పోషకాలు ఎక్కువ
ఖర్చు తక్కువ..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరుగుతోంది. మరోవైపు మొక్కలకు పోషకాలు అందించాలంటే ఎరువుల వాడకం తప్పనిసరిగా మారింది. రాష్ట్రంలో పెద్దదిగా ఉన్న జిల్లాలో దేశ సరాసరి ఎరువుల వినియోగానికి మించి ఎరువులను వినియోగిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎకరానికి ఎరువుల ఖర్చు రూ.6,671 అవుతోంది. ఎకరానికి 104 కేజీల యూరియా, 24 కేజీల డీఏపీ, 14 కేజీల ఎంఓపీ, 136 కేజీల కాంప్లెక్స్, 10 కీజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వినియోగిస్తున్నారు. అన్ని రకాల ఎరువులు కలిపి ఎకరానికి 287 కేజీలు వాడుతున్నారు. జిల్లాలో 2024లో సాగు విస్తీర్ణం 5,92,264 ఎకరాలు కాగా 1,70,153 మెట్రిక్ టన్నులను రైతులు వినియోగించారు. దీని విలువ రూ.395.12 కోట్లు. 2025లో పంటల సాగు విస్తీర్ణం 6,03,124 ఎకరాలు కాగా 1,69,037 మెట్రిక్ టన్నుల ఎరువులను వాడారు. దీని విలువ రూ.396.13 కోట్లు కావడం గమనార్హం.
రసాయన ఎరువులతో
అన్ని పోషకాలు అందవు..
అన్ని రకాల పోషకాలు పంటలకు అందాలంటే రసాయనిక ఎరువుల వల్ల సాధ్యం కాదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర పోషకాలు పంట మొక్కలకు లభిస్తాయని చెబుతున్నారు. నేల సాంద్రతకు భూసార యాజమాన్య పద్ధతులు అవలంబించాలని పేర్కొంటున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పచ్చిరొట్ట ఎరువులు, నవధాన్యాలు, చెరువు మట్టి, పశువుల, గొర్రెల మందలు పెట్టడం వంటి చర్యలు చేపట్టాలి. పంట మార్పిడి, అంతర పంటలసాగు పాటించాలి.
సేంద్రియ ఎరువులతో ప్రయోజనాలు
●పచ్చిరొట్ట పైర్ల సాగువల్ల నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం వృద్ధి చెంది పోషక లభ్యత పెరుగుతుంది.
●పంటల సాగులో అంతర పంటలుగా అపరాల పంటలైన పెసర, మినుము, కంది, అలసంద చేర్చడం ద్వారా నేలలో నత్రజని లభ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పంటలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి
●భాస్వరం కరిగించే బాక్టీరియాను సేంద్రియ ఎరువులతో కలిపి పంటచేలల్లో వినియోగిస్తే నేలలో స్థిరీకరించిన భాస్వరం పంటలకు ఊతంగా నిలుస్తుంది
●కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో మాత్రమే వాడాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం సాగు ఖర్చు పెరగడానికి ఉపయోగం తప్ప పంటలకు లభించదు
●యూరియా, పొటాష్ ఎరువులను పంటకాలంలో మూడు పర్యాయాలుగా విభజించి వినియోగిస్తే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
●వరిలో అజోల్లాను వదలితే నత్రజని పంటకు అందుతుంది.
●పైపాటుగా యూరియాకు బదులుగా నానో యూరియా పిచికారీ చేయటం కూడా ఎరువుల్లో పోషక లభ్యత పెరుగుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
●పైపాటుగా ఎరువులు వేసినపుడు పాకటింగ్ పద్ధతిలో వేయాలి
●మొక్కకు నాలుగు అంగుళాల దూరంలో అంతే లోతు గుంట తీసి ఎరువు వేసి కప్పివేయాలి. ఈపద్ధతి కారణంగా ఎరువు వృథా కాదు. ఈ పద్ధతుల కారణంగా పంటపెట్టుబడి ఖర్చు తగ్గటంతో పాటు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
సేంద్రియ ఎరువులతో
తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు
దేశ సరాసరి కంటే జిల్లాలో రసాయన ఎరువుల వినియోగం అధికం
నాణ్యమైన దిగుబడి..
సాగు ఖర్చు తగ్గి, నేల సాంద్రత పెరిగి అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రియ ఎరువులను రైతులు తప్పకుండా ఉపయోగించాలి. దీని వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నాణ్యమైన పంట దిగుబడులు వచ్చి రైతులు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఈవిషయాలపై రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– పి రవికుమార్, అశ్వారావుపేట ఏడీఏ

పోషకాలు ఎక్కువ

పోషకాలు ఎక్కువ