
పెంచక మూడేళ్లు..
లారీ కిరాయి
సత్తుపల్లి: మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా సత్తుపల్లిలోని బొగ్గు లారీల యజమానుల పరిస్థితి తయారైంది. లారీ నిర్వహణ ఖర్చులు, పన్నులు, బీమా, పెరిగిన డీజిల్ ధరలు, డ్రైవర్లు, క్లీనర్ల జీతభత్యాలు పెరిగిపోతుంటే.. వారికి ఇచ్చే కిరాయి మాత్రం పెరగడం లేదు. మూడేళ్ల క్రితం హైదరనాబాద్‌కు బొగ్గు రవాణా చేస్తే టన్నుకు రూ.1,400 చెల్లించేవారు. ఇప్పుడు అదే అద్దె చెల్లిస్తుండడం గమనార్హం. ఒక్కో లారీకి ఏజెంట్ కమీషన్ రూ.3వేలు దండుకుంటున్నా.. కిరాయి పెంచకపోవడంపై లారీల యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయినా లారీలను ఏజెంట్లు చెప్పినట్లుగా అద్దెకు తిప్పాల్సి వస్తోంది. అయితే, ఈ అంశంపై లారీ యజమానుల యూనియన్ దృష్టి సారించకపోవటం మరింత ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ఉద్యమించి సాధించుకున్న బొగ్గు లోడింగ్ దళారుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలు కాని తీర్మానం
ఏడాదిన్నర క్రితం ఎవరికై నా ఐదు లారీల కంటే ఎక్కువ ఉంటే వాటిని యూనియన్ పరిధిలో సీరియల్ వేసేది లేదని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. అయినా అమలుకు నోచుకోవడం లేదు. ఐదు లారీల కంటే ఎక్కువగా 20 మంది కలిగి ఉండగా.. వీరి లాభం కోసం ఒక్కో లారీ ఉన్న యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. యూనియన్‌లో కూడా వీరి పెత్తనమే ఉండటంతో చర్చించటానికి సైతం ముందుకు రావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
భూ నిర్వాసితుల సంగతేమిటి?
సత్తుపల్లి మండలంలోని కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాథపురం, చెరకుపల్లి, రేజర్ల గ్రామాల రైతులు వందల ఎకరాల భూమిని సింగరేణి గనుల కోసం అప్పగించారు. ఆ సమయాన భూనిర్వాసితులకు బొగ్గు రవాణాలో ప్రాధాన్యత కల్పిస్తామని సింగరేణి అధికారులు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరడం లేదు. ఏడాది క్రితం భూ నిర్వాసితులు తమ న్యాయమైన వాటా కింద లారీలకు లోడింగ్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తే.. లారీ యూనియన్ బాధ్యులు చర్చిద్దామని నచ్చజెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. సుమారు వందకు పైగా లారీలు భూనిర్వాసితులకు ఉండగా.. లోకల్, నాన్‌లోకల్ లోడింగ్ కారణాలతో లోడింగ్ దక్క ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక రోడ్డున పడుతున్నారు.
నాన్‌లోకల్ రోజుకు 20
లారీల యజమానుల ఆందోళనలకు మద్ధతు తెలుపుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో లారీలకు రోజూ 1,500 టన్నుల బొగ్గు లోడింగ్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోజుకు 50 లారీలకు లోడింగ్ దక్కుతుండగా... నాన్‌లోకల్ లారీలకై తే కమీషన్ ఎక్కువగా వస్తుందని 20 లారీలు ఇస్తుండడంతో స్థానిక లారీ యజమానులకు మళ్లీ సీరియల్ బాధలు తప్పడం లేదు. లారీ యూనియన్ బాధ్యులు దీనిపై దృష్టి సారించకుండా లోడింగ్ లేవంటూ ఆందోళనలు చేయటం.. తీరా లోడింగ్ వచ్చిన తర్వాత నాన్‌లోకల్ లారీలకు ఏజెంట్లు కట్టబెడుతున్న తీరుపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకపోతే కోయగూడెం ఓసీలో నాన్‌లోకల్ కింద బయట లారీలకు కిరాయి ఇవ్వకుండా స్థానిక లారీలకే నాన్‌లోకల్ కింద తక్కువ కిరాయితో పంపిస్తున్నట్లు సమాచారం.
ఏజెంట్ల ఇష్టారాజ్యంతో
యజమానులకు అన్యాయం
భూనిర్వాసితులకు దక్కని ప్రాధాన్యత