రేపు హయగ్రీవ జయంతి
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో అభిషేకం, సాయంత్రం 4గంటలకు బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన గావిస్తారు. శనివారం హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవునికి ఉదయం ప్రత్యేక స్నపనం, తిరుమంజనం జరపనున్నారు.
చిన్నారులకు పలక, బలపం, నోటు పుస్తకాలను అందిస్తారు. అదే రోజు మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం, సాయంత్రం హవనం నిర్వహించారు. కాగా పవిత్రోత్సవాల సందర్బంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, పాలక మండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. కాగా, పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మీబాయి
కొత్తగూడెంఅర్బన్ : విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, ఈ మేరకు ఉపాధ్యాయులు తగిన ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, ఎస్‌ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి అన్నారు. జూలూరుపాడు మండలంలోని కేజీబీవీని గురువారం ఆమె సందర్శించారు. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. యూడైస్ ప్లస్, అపార్ జనరేషన్, విద్యార్థుల సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో జిల్లా ప్రగతిని విశ్లేషించాలని సూచించారు. పెండింగ్ పనుల వివరాలను ఈనెల 10వ తేదీ లోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పారు. డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యా వ్యవస్థను ముందుకు నడిపిస్తామని అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలు దక్కాయి. జిల్లాకు చెందిన 15 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. రెండు స్వర్ణ, రెండు కాంస్య, ఒక రజిత పతకాలు సాధించారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. విజేతలను డీవైఎస్‌ఓ ఎం. పరంధామరెడ్డి, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కె.సారంగపాణి, జాతీయ కోచ్ నాగపూరి రమేష్ అభినందించారు.

నేడు రామాలయంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు

అభ్యసన సామర్థ్యాలు పెంచాలి