● ఆలయ మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలే కీలకం ● ప్రస్తుత ఈఓ బదిలీ, ఇంకా ఎవరినీ నియమించని ప్రభుత్వం ● సీనియర్ అఽధికారిని కేటాయించాలంటున్న భక్తులు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాఢ వీధుల విస్తరణ జరుగుతోంది. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనుండగా వీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం కావాల్సి ఉంది. మాస్టర్‌ప్లాన్ పనులు సైతం చేపట్లాల్సి ఉన్న ఈ తరుణంలో ఆలయ ఈవో ఎల్.రమాదేవికి బదిలీ కావడం, ఈ పోస్టులో ప్రభుత్వం ఇప్పటివరకు ఏ అధికారినీ నియమించకపోవడంతో పనులు సాగేదెలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో ఈఓగా సీనియర్ అధికారిని లేదా ఐఏఎస్‌ను నియమించాలని కోరుతున్నారు.
మాఢ వీధులకు నిధులు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతోంది. తొలి ఘట్టమైన మాఢ వీధుల విసర్ణణకు నిధులు కేటాయించింది. దీంతో ఆలయానికి మూడు వైపులా ఉన్న ఇళ్లను తొలగించిన రెవెన్యూ అధికారులు.. భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. శిథిలాల తొలగింపు అనంతరం ఆ భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత రోడ్లు, ఇతర పనులు చేపడతారు. అయితే పనుల వేగవంతం, దేవస్థానం అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం వంటి పనుల్లో ఆలయ కార్యనిర్వాహక అధికారే కీలక పాత్ర పోషిస్తారు. ఇక మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుణ్య స్నానాలకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రద్దీకి తగినట్టుగా ఆలయంలో దర్శన సౌలభ్యం, ఇతర వసతి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు, ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోనూ ఈఓనే కీలకం.
ముందస్తు చర్యలు చేపట్టాలి
భద్రాచలం దివ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గత పుష్కరాల సమయంలోనే పనులు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా ముందుస్తు చర్యలు చేపట్టాలి. అందుకు అనుభవం కలిగిన సీనియర్ అధికారి ఈఓగా ఉంటేనే మేలు.
– అడపా వాసు, భద్రాచలం
సీనియర్లయితేనే మేలు..
ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న రమాదేవికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేశారు. దీంతో ఆలయ ఈఓ పోస్టు ఖాళీ కాగా, ఇంకా భర్తీ చేయలేదు. ఆలయ ఈఓ పోస్టును సీనియర్ అధికారి లేదా ఐఏఎస్ అధికారితో భర్తీ చేయాలని భక్తులు అంటున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం తెలంగాణాకే ప్రత్యేకమైన దేవస్థానం. ఇంతటి కీలక ఆలయాన్ని, వ్యవస్థను నిత్యం పర్యవేక్షించి పరిపాలనను గాడిలో పెట్టాలంటే సమర్థవంతమైన అధికారి అయితేనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పనులు సాగేదెలా ?