
మునగ సాగులో ముందంజ
సూపర్‌బజార్(కొత్తగూడెం): మునగ సాగు ద్వారా ఆదాయాభివృద్ధిలో భద్రాద్రి జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్’పై జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మునగసాగుపై వివరించారు. తెలంగాణలో పెద్దదైన జిల్లా.. 50 శాతం అడవులతో నిండి ఉందని, 37 శాతం గిరిజన జనాభా ఉందని తెలిపారు. వివిధ పంటలు సాగు చేస్తున్నప్పటికీ తక్కువ ఆదాయం పొందుతున్నారని, పత్తికి సగటున ఎకరాకు రూ.15 వేలు, మొక్కజొన్నకు రూ. 30వేలు మాత్రమే లాభం వస్తోందని వివరించారు. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో టీఎన్‌ఏయూ(కోయంబత్తూర్), జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నిపుణులతో మునగసాగు, లాభాలపై కరపత్రాల ద్వారా అవగాహన పెంచామని, ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఖర్చు లేకుండా మునగ సాగు ప్రారంభించామని చెప్పారు. ఎకరానికి 1000 మొక్కలుంటాయని, కనీసం ఒక్కో చెట్టుకు 100 కాయల దిగుబడి వచ్చినా..రూ. 2కు కాయ చొప్పు రూ.2 లక్షల ఆదాయం పొందవచ్చని, ఆకుల విక్రయంతో అదనంగా రూ. 20వేలు లాభం వస్తుందని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 415 ఎకరాల్లో మునగ సాగవుతోందని, 100 ఎకరాల్లో ప్రధాన పంటగా, 315 ఎకరాల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన రైతు జమీల్ మునగ ఆకులతో కోళ్లకు మేతవేసి అదనపు ఆదాయం పొందారని, ప్రస్తుతం కౌజు పిట్టల యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని వివరించారు. రైతుల అనుమానాలను తొలగించి, గ్రామీణ స్థాయిలో విజేతల అనుభవాలను పంచుకోవడం ద్వారా రైతులు ప్రయోగాత్మకంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. కాగా, సెమినార్‌లో పాల్గొన్న కేంద్రస్థాయి అధికారులు, ఇతర జిల్లాల కలెక్టర్లు ఇక్కడి మునగసాగును అభినందించారు.
ఆదాయాభివృద్ధిలో మోడల్‌గా జిల్లా..
ఢిల్లీ సెమినార్‌లో కలెక్టర్ వెల్లడి
రైతు జమీల్ సక్సెస్ స్టోరీని వివరించిన పాటిల్