
అమాయకులను హతమారుస్తున్నారు..
ఇల్లెందు : ఛత్తీస్‌గఢ్‌లో ఆరు నెలలుగా మారణహోమం సాగుతోందని, పోలీసులు, కేంద్ర బలగాలు మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను హతమార్చారని ఆదివాసీ హక్కుల పోరాట వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కో కన్వీనర్ ఎన్.నారాయణరావు అన్నారు. ఇల్లెందులో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మొత్తం 650 మందిని హత్య చేయగా అందులో 450 మంది ఆదివాసీలే ఉన్నారని తెలిపారు. ఇంకా లెక్కలోకి రాని మరెంతో మందిని పోలీసులే ఖననం చేశారని ఆరోపించారు. ఆదివాసీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9వ తేదీన హైదరాబాద్‌లో, ఈనెల 24న వరంగల్‌లో, అక్టోబర్ 5న ఇల్లెందులో పలువురు మేధావులతో సభలు నిర్వహిస్తామని వివరించారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని, వనరుల దోపిడీని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక నేతలు బాలయ్య, చంద్రమౌళి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, ముక్తి సత్యం, మెంతన సంజీవరావు, గుంపిడి వెంకటేశ్వర్లు, సూర్ణపాక సత్యనారాయణ, వట్టం కన్నయ్య, కె.గీతారెడ్డి, దుర్గారావు, వీరభద్రం, ఎట్టి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కుల పోరాట వేదిక
కన్వీనర్ గడ్డం లక్ష్మణ్