
ఇస్తినమ్మ వాయినం!
నేడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్న మహిళలు
● లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం
● ఆలయాలు, ఇళ్లలో పూజలకు ఏర్పాట్లు
కొత్తగూడెంటౌన్: శ్రావణమాసంలో తలపెట్టిన పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని, వరలక్ష్మీవ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు, సంపదలు చేకూరుతాయని మహిళలు విశ్వసిస్తారు. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా మగువలు వ్రతం ఆచరించనున్నారు. మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ ఇది. వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద, భూమి, శిక్షణ, ప్రేమ కీర్తి, శాంతి, సంతోషం, శక్తి సిద్ధిస్తాయని వేదపండితులు, అర్చకులు పేర్కొంటున్నారు. వివాహితలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని వ్రతం ఆచరిస్తారు. ఆలయాలు, ఇళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీవ్రతం జరుపుకోవడం ఆచారమని పురోహితులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆలయాలు, ఇళ్ల్లలో పూజలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
గారెలు, బూరెలతో నైవేద్యం
వ్రతం సందర్భంగా తొలుత అమ్మవారి చిత్రపటాల వద్ద ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. పండ్లు, పూలు, గాజులతో అలంకరిస్తారు. అమ్మవారు మెచ్చే గారెలు, బూరెలు, పులిహోర, పూర్ణాలు, శెనగల ప్రసాదం నైవేద్యంగా పెడతారు. ఎరుపు, ఆకుపచ్చ, బంగారు వర్ణపు చీరలు ధరించి మహిళలు పూజలు చేస్తారు. కొందరు అమ్మవారికి చిత్రపటం ఎదుట కలశ స్థాపన చేస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని, కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు వ్రతం ఆచరిస్తారు. వ్రతం అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
మార్కెట్‌లో పూల సందడి
వరుస పండుగలు కావడంతో జిల్లా కేంద్రంలో గురువారం పూల సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో కొత్తగూడెం సూపర్‌బజార్, రైతుబజార్, రామవరం, పాలకేంద్రం, రుద్రంపూర్, పాత కొత్తగూడెం, విద్యానగర్‌కాలనీ, పోస్టాఫీస్ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పూలు, స్వీట్లు, నూతన వస్త్రాల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. కిలో చామంతి రూ.800, దండ (చామంతి) రూ.300, లిల్లీ పూల దండ రూ.200, బంతిపూలు పావు కిలో ధర రూ.50, గనుగు పూలు రూ.15, తామర పువ్వు రూ. 15, తమలపాకులు కట్టా రూ.10, చామంతి ఆకు రూ.50, మల్లెపూలు మూర రూ.50, గుమ్మడి కాయ ధరలు రూ.200 నుంచి రూ. 350 వరకు, తంగేడు పూల కట్ట రూ.15, గులాబీ పూవు ఒక్కోటి రూ. 40, గోరింట పూలు చటాక్ రూ.40 వరకు పలికాయి. చామంతి పూలు మూర రూ.50, విరజాజి పూలు మూర రూ.50కు విక్రయించారు.

ఇస్తినమ్మ వాయినం!