
పేకాటరాయుళ్లపై కేసు నమోదు
దమ్మపేట: మండలంలోని గండుగులపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఓ వ్యక్తి పరారయ్యాడు. రూ.2,800 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
అశ్వారావుపేటరూరల్: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కేశప్పగూడేనికి చెందిన సోడెం మహేష్(29), అతని తమ్ముడు ముత్యాలరావు, మరికొందరు కలిసి ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువులో చేపలు వేటకు వెళ్లారు. ఈ క్రమంలోనే మహేష్ చెరువులో దిగి వల విసిరే సమయంలో అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతూ గట్టిగా కేకలు వేశాడు. ముత్యాలరావుతోపాటు గ్రామస్తులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీళ్లలో మునిగిపోవడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడు అవిహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ యయాతీ రాజు తెలిపారు.
ఇంటిపై పిడుగుపాటు
రూ.లక్ష ఆస్తి నష్టం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారాయణపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు కూకటి వెంకన్నబాబు ఇంటి భవనంపై పిడుగు పడింది. దీంతో స్లాబ్ పెచ్చులు ఊడిపోగా, ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లతోపాటు విద్యుత్ మీటర్ కాలిపోయాయి. సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆర్‌ఐ కృష్ణ గురువారం బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.
హైదరాబాద్‌లో అశ్వారావుపేట వాసి మృతి
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన పంబి శ్రావణ్(30) భార్య సోనితో కలిసి మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ, జీవనం సాగిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, శ్రావణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తండ్రి అశ్వారావుపేటలో పంచాయతీ రాజ్ శాఖలో అంటెడర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇద్దరిపై కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: బ్యాంక్ రుణం పేరుతో మహిళను మోసం చేసిన ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని నందమూరినగర్‌కు చెందిన హలీమాకు ప్రైవేటు బ్యాంక్‌లో రూ. 7 లక్షల రుణం ఇప్పిస్తామని అశ్వారావుపేటకు చెందిన పీ ఫణింద్ర, అతని తండ్రి రామస్వామి బాధితురాలి సంతకాలతో ఖాళీ చెక్కులు తీసుకున్నారు. ఆ తర్వాత హలీమా బ్యాంక్ అకౌంట్‌లో పడిన నగదు నుంచి రూ. 2 లక్షలు కాజేసి, విడతల వారీగా వస్తాయని నమ్మించారు. తిరిగి నగదు జమ కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పేకాటరాయుళ్లపై కేసు నమోదు

పేకాటరాయుళ్లపై కేసు నమోదు