
10న మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
కొత్తగూడెంఅర్బన్: హైదరాబాద్ కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యాన గుండె సంబంధిత వ్యాధి నిపుణులు వి.సూర్యప్రకాశరావు నేతృత్వంలో ఈనెల 10వ తేదీన గుండె సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం కేసీఓఏ క్లబ్‌లో జరుగుతుందని.. ఈసీజీ, టుడీ ఎకో, జీఆర్‌బీఎస్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ పరీక్షలు, కన్సల్టేషన్ ఉచితంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే శిబిరంలో పరీక్షల కోసం శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం 95054 84389(మునీంద్రరెడ్డి), 88868 53111(నాగార్జున), 63049 25761(మోహిత్ సుభాష్) నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
మీ సేవ కేంద్రాల్లో తనిఖీ
ఇల్లెందు: పట్టణంలోని మీ సేవ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని, ప్రజలకు సేవలు వేగవంతంగా అందజేయాలని సూచించారు. సూచిక బోర్డులు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీ సేవ కేంద్రాల జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విధుల నుంచి
ఉపాధ్యాయుడి తొలగింపు
దుమ్ముగూడెం : మండలంలోని లక్ష్మీనగరం ఏకలవ్య పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎల్.నాగేశ్వరరావును ఉన్నతాధికారులు గురువారం విధుల నుంచి తొలగించారు. ఏకలవ్య పాఠశాల కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ఆరో తరగతి విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా, విద్యార్థిని తల్లి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్‌సీఓ అరుణకుమారి బుధవారం విచారణ నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మి ఆదేశాలతో ఐటీడీఏ పీఓ రాహుల్ సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించినట్టు ఆర్‌సీఓ తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని గిరిజనులు మల్లు దొర, కారం గోపాల్, కనితి జంపన్న, రామకృష్ణ తదితరులు కోరారు.
పోడు రైతు రిమాండ్
పాల్వంచరూరల్: పోడు కొట్టిన కేసులో కోర్టుకు హాజరుకాని రైతుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వైల్డ్‌లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన రైతు అలకుంట రమేష్ అక్రమంగా పోడు సాగు చేసినట్లు 2024 మే నెలలో యానంబైల్ రేంజ్ వైల్డ్‌లైఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున, కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం 14 రోజుల రిమాండ్ విధించగా, భద్రాచలం సబ్ జైలుకు పంపించినట్లు సెక్షన్ ఆఫీసర్ తెలిపారు.
చోరీపై విచారణ
దుమ్ముగూడెం: మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన సోయం రామిశెట్టి ఇంట్లో జరిగిన చోరీ కేసుపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ గణేష్ గురువారం తెలిపారు. ఈ నెల 6న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించారని పేర్కొన్నారు. మూడు ఇనుప బీరువాలను పగులగొట్టి బంగారం, నగదు.. మొత్తం రూ.3,53,000 విలువైన సొత్తు చోరీ చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.