
జామాయిల్ కలప మాయం
ములకలపల్లి: తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న ప్లాంటేషన్‌లో జామాయిల్ మొక్కలు మాయమయ్యాయి. రూ. రెండు లక్షలకుపైగా విలువైన కలప స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండలపరిధిలోని రంగాపురం శివారులో ములకలపల్లి రేంజ్‌లో 2006లో జామాయిల్ ప్లాంటేషన్ వేశారు. 60.5 హెక్టార్ల పరిధిలో లక్ష మొక్కలకు పైగా నాటారు. ఇప్పటికే రెండు దఫాలుగా కటింగ్ చేయగా, కలప మూడో కటింగ్‌కు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది వీటిని విక్రయించనున్నారు. ఈ తరుణంలో కొంత కలప మాయం చేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు చెట్టుకు ఒక కొమ్మ నరికి రెండో కొమ్మను వదిలేశారు. అయితే ఇది ఇంటి దొంగల పనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం సుమారు 500 పైచిలుకు చెట్లను నరికి, గత గురువారం బయటకు తరలించినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు ట్రాక్టర్ల మేర కలప స్వాహా చేసినట్లు సమాచారం. సంబంధిత శాఖ అధికారులు మాత్రం కొంత కర్రను ములకలపల్లిలోని ఓ ప్రైవేటు అడితీలో స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ డిపోకు తరలించారు. కానీ కలప విక్రయించిన, కొనుగోలు చేసినవారిపై కేసు నమోదు చేయలేదు. విషయం బయటకు పొక్కుతున్న క్రమంలో కొద్దిపాటి కలపను పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా జరిమానా విధించి, ఒక్క వ్యక్తిపైనే కేసు నమోదు చేసి తమ వారిని ఒడ్డున వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అక్రమంగా కలప తరలింపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ప్లాంటేషన్ మేనేజర్ సునీతను వివరణ కోరగా... 500 మొక్కలు నరికినట్లు గుర్తించామని, ఒకరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.65 వేల జరిమానా విధించామని, సమగ్ర విచారణ సాగుతోందని వివరించారు.