
మా కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది..
చర్ల: ఇసుక అక్రమాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు అందిస్తామని, విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని చర్ల మండలం మొగళ్లపల్లి భూమి పుత్ర సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం కొందరు సభ్యులు సమావేశమై తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. గోదావరి నదిలో చేపట్టిన ఇసుక క్వారీని తాము నిర్వహిస్తున్నామని, అయితే ఇసుక రీచ్ మంజూరుకు రైజింగ్ కాంట్రాక్టర్ రూ.కోట్లు ఖర్చు చేశాడంటూ సొసైటీ రికార్డులన్నీ ఆయన వద్దే ఉంచారని, దీనిపై తమ సొసైటీ అధ్యక్షురాలిని అడిగితే తమపైనే వాదనకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీ రికార్డుల తనిఖీకి వచ్చిన అధికారులు.. పంచాయతీ కార్యాలయంలో కాకుండా కాంట్రాక్టర్ ఇంటి వద్ద రికార్డులు తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు, కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు సభ్యులమైన తమ కడుపు కొడుతున్నారని, ఈ విషయంలో అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. తామే ఇసుక క్వారీ నిర్వహించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇసుక అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఇతర ఉన్నాతాధికారుల సమక్షంలో విచారణ చేపడితే అందిస్తామని తెలిపారు.
మొగళ్లపల్లి భూమిపుత్ర సొసైటీ
సభ్యుల ఆవేదన