
మెనూ అమలులో నిర్లక్ష్యం తగదు..
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేస్తున్న అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని సంబంధిత ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ఉపాధ్యాయులను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గురుకుల ప్రిన్సిపాళ్లతో ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 15 రోజులుగా గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థలకు సరఫరా చేసే ఆహారం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనబడుతోందని, ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది కలిసి శ్రమదానం చేసుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఏజెన్సీల ద్వారా సరఫరా చేసే కూరగాయలు, జీసీసీ ద్వారా సరఫరా చేసే బియ్యం, పప్పులు, ఉప్పులు, పల్లి పట్టి నాణ్యతగా ఉన్నవి తీసుకోవాలని, నాసిరకంగా ఉన్నట్లు తెలిస్తే వెంటనే ఆర్సీఓకి తెలపాలని చెప్పారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 8, 9, 10వ తరగతి పిల్లలకు ప్రతీ నెల 2వ శుక్రవారం, 4వ శుక్రవారం తప్పనిసరిగా ఏదో ఒక శాఖ నుంచి అధికారిని పిలిపించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్సీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
మెనూ పక్కగా అమలు చేయాలి
ములకలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ కచ్చితంగా అమలు చేయాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ తెలిపారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల/ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, స్టాక్ రూం, కిచెన్ గార్డెన్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను చిన్నారులకు అందించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంఈఓ సత్యనారాయణ, హైస్కూల్ హెచ్‌ఎం లత, ఎస్‌ఎంసీ చైర్మన్ గొడ్ల రాజు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్

మెనూ అమలులో నిర్లక్ష్యం తగదు..