
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
జూలూరుపాడు: కుటుంబీకులంతా దైవదర్శనం చేసుకున్నారు. బంధువులను కలిసి, మరో బంధువు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కానీ, వారి ప్రయాణం గమ్యం చేరుకోలేదు. వీరు వెళ్తున్న మారుతి వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గద్దలగూడెం గ్రామానికి చెందిన కె.చెన్నారావు (33) ఖమ్మంటౌన్–3 విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు నుంచి బుధవారం తొమ్మిది మంది వ్యాన్‌లో ఖమ్మం వెళ్లగా చెన్నారావు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మంలో దైవదర్శనం అనంతరం బంధువులను కలిసి చుంచుపల్లి బయలుదేరారు. హౌసింగ్ బోర్డులో బుధవారం సాయంత్రం చెన్నారావు మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వద్ద వీరి వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చెన్నారావుకు తీవ్రగాయాలు కాగా సీపీఆర్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆయన భార్య భార్గవి, తల్లి సావిత్రి, మరో ముగ్గురు క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చెన్నారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది.
ఒకరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు