
ఆస్పత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీపీఐ నేత అయోధ్య ● సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన
మణుగూరు టౌన్ : కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతూ.. చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య(74) దుర్మరణం పాలయ్యారు. మణుగూరు నుంచి మంగళవారమే తన కారులో వెళ్లి సూర్యాపేటలోని కుమార్తె నివాసంలో బస చేశారు. బుధవారం తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో డ్రైవర్ రమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రజాప్రతినిధిగా తనదైన ముద్ర..
మణుగూరుకు చెందిన అయోధ్య పీఏసీఎస్ చైర్మన్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కూడా సేలందించారు. కాంట్రాక్ట్ కార్మికులు, లారీ, కోల్ యూనియన్, కోల్ ట్రాన్స్‌పోర్ట్.. ఇలా పలు రంగాల కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు. చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. 18 ఏళ్ల వయసులో సీపీఐలో చేరి కడవరకూ అదే పార్టీలో కొనసాగారు. సీపీఐ మండల కమిటీ సభ్యుడి నుంచి ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.
శోకసంద్రంలో మణుగూరు..
అయోధ్య మరణ వార్త తెలియగానే మణుగూరు, పరిసర ప్రాంతాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి సంతాపంగా కిరాణా, బులియన్, ఇతర వ్యాపారులు, ప్రైవేట్ పాఠశాలల వారు స్వచ్ఛందంగా బంద్ చేశారు. సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం సాయంత్రం 6 గంటలకు భౌతికకాయం మణుగూరుకు చేరింది. కొత్తగూడెం – మణుగూరు మధ్యలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులు, అభిమానులు మృతదేహంతో పాదయాత్రగా తరలివచ్చారు. కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. అయోధ్య మృతదేహానికి గురువారం ఉదయం రామానుజవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): అయోధ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా నివాళులర్పించారు. సూర్యాపేట నుంచి మణుగూరుకు భౌతికకాయాన్ని తీసుకొస్తున్న క్రమంలో పార్టీ శ్రేణుల సందర్శనార్ధం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో కాసేపు ఉంచారు. సీపీఐ, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాపసభలో సాబీర్‌పాషా మాట్లాడుతూ పార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని, అనేక భూపోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, మైనార్టీ సంఘాల నాయకులు నయీమ్ ఖురేషి, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్ధా భిక్షం, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, దమ్మాలపాటి శేషయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, దారా శ్రీను, ధనలక్ష్మి, అబీద్ తదితరులు ఉన్నారు.

ఆస్పత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు