
స్థానిక పోరుకు సన్నద్ధం
● జీపీ, పరిషత్‌కు రెండు దశల్లో ఎన్నికలు ● ప్రతిపాదనలను సిద్ధం చేసిన అధికారులు ● ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తి
చుంచుపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సారి రెండు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాల్లో సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. 2019లో గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లోనే నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ఆరు నెలల క్రితమే ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకాలు తదితర 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల ప్రకటన వెలువడడమే తరువాయి.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులతో పాటు గతంలోనే కర్ణాటక నుంచి మరికొన్ని తెప్పించారు. ప్రస్తుతం జంబో బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉండగా మరో 1,000 బాక్సులు అదనంగా తెిప్పించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 471 గ్రామ పంచాయతీల్లో 4,168 వార్డులు ఉన్నాయి. అలాగే 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ఇప్పటికే పూర్తయింది. సర్పంచ్‌లకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగులో ముద్రించి స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చారు. పంచాయతీ ఎన్నికలకు 10,223 మంది, పరిషత్‌లకు 8,711 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. పంచాయతీ ఎన్నికలకు 4,242 పోలింగ్ కేంద్రాలు, పరిషత్ పోలింగ్‌కు 1,271 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల్లో, మలి విడతలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో నిర్వహించనుండగా, పరిషత్ ఎన్నికలు 11 మండలాల చొప్పున రెండు విడుతల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
రెండు విడతల్లో నిర్వహిస్తాం
రాష్ట్ర ఈసీ ఆదేశాల మేరకు ఈసారి రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గతంలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలపై ప్రకటన ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ

స్థానిక పోరుకు సన్నద్ధం