
వైభవోపేతంగా పవిత్రార్పణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం పవిత్రార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి వేద విన్నపాలు చేశారు. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, సహస్ర ధారలతో ప్రత్యేక స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు నిర్వహించాక హారతి సమర్పించారు. ప్రధాన ఆలయం నుంచి పవిత్రాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజల అనంతరం మూలమూర్తులకు ధరింపజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి లక్ష్మీతాయారు అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి భక్తరామదాసు, గోదాదేవి అమ్మవారికి అలంకరించారు. ఆలయానికి, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, సుదర్శన చక్రానికి పవిత్రాలను ధరింపచేసి, అర్చకులు సైతం ధరించారు. గతేడాది కాలంలో రామాలయంలో జరిగిన పూజాది కార్యక్రమాల్లో జరిగిన దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు. ఆ తర్వాత ఈఓ రమాదేవికి వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రదాత..
జయశంకర్
భద్రాచలంటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ అని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం ఐటీడీఏలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 నుంచే జయశంకర్ అహర్నిశలూ ఉద్యమించారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు హరీష్, లక్ష్మీనారాయణ, రమేష్, భాస్కరన్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్ రావు, హరికృష్ణ పాల్గొన్నారు.
పీఓను కలిసిన సబ్ కలెక్టర్..
భద్రాచలం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మ్రిణాల్ శ్రేష్ఠ పీఓ రాహుల్‌ను మరాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. ఆదివాసీల భూ సమస్యలతో పాటు రెవెన్యూ సమస్యలు, కోర్టు కేసుల వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఈ సందర్భంగా పీఓ కోరారు.

వైభవోపేతంగా పవిత్రార్పణ