
చిన్నారులకు విద్య, వైద్యమే ప్రధానం
● గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడాలి ● అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన
ములకలపల్లి : పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం ఎంతో ప్రధానమైనవని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈ రెండూ సక్రమంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మండలంలోని మంగపేట పీహెచ్‌సీ, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత పీహెచ్‌సీలో వైద్యుల హాజరు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వ తదితర వివరాలను పరిశీలించారు. పేషంట్లకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడాలని, సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాలను సందర్శించి.. మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను రాబట్టారు. వారికి పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేశారు. పిల్ల లు కింద కూర్చోకుండా తరగతి గదుల్లో బెంచీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్థార్ భూక్యా గన్యా, ఎంఈఓ సత్యనారాయణ, హెచ్‌ఎం కోటమ్మ, అంగన్‌వాడీ టీచర్ సుజాత, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.