
పోడు రైతులపై అటవీ అధికారుల దాడి ?
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం గడ్డోరగట్ట గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై అటవీ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేశారని తెలిసింది. పోడు భూముల్లో సాగు చేసిన పత్తి మొక్కలను అటవీ అధికారులు తొలగించారంటూ మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్యతో కలిసి కొందరు రైతులు సోమవారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం గ్రామంలోకి వెళ్లిన అటవీ అధికారులు.. మళ్లీ పీఓ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అంటూ తమపై దాడి చేశారని కుంజా జోగయ్య, మిడియం తులశమ్మ, సోడి రమణ, కణితి జయమ్మ తదితరులు ఆరోపిస్తున్నా రు. ఫొటోలు తీయకుండా సెల్‌ఫోన్‌లు సైతం లాక్కున్నారని చెప్పారు. అయితే సీపీఎం జిల్లా నాయకులు యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్ర య్య మంగళవారం బాధితులను పరామర్శించే వరకు ఈ ఘటన వెలుగులోకి రాకపోవడం గమనార్హం. దీన్ని సుమోటాగా స్వీకరించి అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని వారు ఐటీడీఏ పీఓ రాహుల్‌ను కోరారు. దీనిపై దుమ్ముగూడెం అటవీ రేంజర్ కమలను వివరణ కోరగా మూడు రేంజ్‌ల పరిధి సిబ్బంది వనమహోత్సవం కార్యక్రమంపై డెమో ఇచ్చేందుకు సిబ్బంది వెళ్లగా ఇద్దరు గ్రామస్తులు తమను చూసి పారిపోయారని, తాము ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు.