
అనుబంధానికి ఆర్టీసీ చేయూత!
● రాఖీ పండుగకు అదనపు సర్వీసులు ● ఖమ్మం రీజియన్‌లో 111 బస్సుల ఏర్పాటు
ఖమ్మంమయూరిసెంటర్: సోదరులకు రాఖీ కట్టేందుకు వచ్చివెళ్లే మహిళలతో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు నుంచే బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఈమేరకు ముందస్తు ఏర్పాట్లపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. రద్దీకి అనుగుణంగా ఈనెల 7నుంచి 11వ తేదీ వరకు ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి 111అదనపు సర్వీసులు నడిపించాలని నిర్ణయించారు.
వరుస సెలవులు
రాఖీ పౌర్ణమి రెండో శనివారమైన 9వ తేదీన వచ్చింది. పాఠశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉండడం, ముందు రోజు కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళా ఉద్యోగులు సెలవు పెట్టి స్వగ్రామాలకు వెళ్లనున్నారు. ఇక పండుగ తర్వాత ఆదివారం రావడంతో మూడు రోజులు స్వస్థలాల్లో గడిపేలా కుటుంబాలతో సహా వెళ్లే అవకాశముంది. దీంతో 7వ తేదీ నుంచే అధికారులు ప్రత్యేక సర్వీసులు(అదనపు బస్సులు) నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అదనపు బస్సులన్నీ ఈ రూట్‌లోనే నడిపేలా కారాచరణ సిద్ధం చేశారు.
రిజర్వేషన్.. అదనపు చార్జీ?
రోజూ నడిచే సర్వీసులకు తోడు ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి అదనంగా 111 బస్సులు నడపిస్తారు. అయితే, అదనపు సర్వీసుల్లో రిజర్వేషన్ అమలు చేయడమే కాక సాధారణ చార్జీ కంటే అదనంగా వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈమేరకు 60 బస్సుల్లో రిజర్వేషన్, మిగతా బస్సులు బస్సులను రిజర్వేషన్ లేకుండా నడపాలని నిర్ణయించారు. ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు, 10, 11వ తేదీల్లో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా ఖమ్మం డిపో నుంచి 24 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేస్తుండగా, మధిర, భద్రాచలం నుంచి 19చొప్పున, సత్తుపల్లి నుంచి 17, మణుగూరు నుంచి 14, కొత్తగూడెం నుంచి 11, ఇల్లెందు డిపో నుంచి ఏడు బస్సుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు
రాఖీ పండుగకు వచ్చివెళ్లే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ బస్సులు నడుపుతాం. బస్టాండ్లలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చేలా ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నాం.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్