
ఆస్పిరేషన్ నుంచి ఇన్ స్పిరేషన్‌గా మారాలి
చుంచుపల్లి: ఆస్పిరేషన్ జిల్లాగానే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే ఇన్‌స్పిరేషన్ జిల్లాగా మారాలని, అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రస్థానంలో నిలిచి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌గా గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ప్రతీ ఉద్యోగి సమర్థంగా పనిచేయడం వల్లే జిల్లా ఈ స్థాయికి చేరిందని తెలిపారు. ఇంకుడు గుంతలు తవ్వాలనే పిలుపుతో అన్ని గ్రామాల్లో చేపట్టిన ఈ సామూహిక కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం, ఎనీమియా వంటి సమస్యలు ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు స్మార్ట్ అంగన్‌వాడీలు, డిజిటల్ తరగతులు, ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీపీఓ సంజీవరావు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కలెక్టర్‌ను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏఓ బాబూరావు, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లేనినా తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్టుకు అవార్డు
టేకులపల్లి: ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్టు పరిధిలోని గుండాల మండలంలో 100 శాతం న్యూట్రిషన్ సాధించింది. దీంతో మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీఓ కె.ఎం.తారతో పాటు సూపర్‌వైజర్లు స్వరాజ్యలక్ష్మీ, ఖలీదాబేగం, పదిమంది అంగన్‌వాడీ సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు.
ప్లాంటేషన్ వేగవంతం చేయాలి
కొత్తగూడెంఅర్బన్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవరణలో ప్లాంటేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి మంగళవారం ఆయన యూనివర్సిటీ ఆవరణలో చెట్ల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవనాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తరగతి గదుల నిర్మాణానికి అనుగుణంగా ఆవరణను చదును చేయాలని సూచించారు. ఖాళీ ప్రదేశంలో విస్తృతంగా ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే పనస, టెకోమో, తెల్ల గన్నే రు, మందారం మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇంజనీరింగ్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్