
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలని, 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలని, బీఈడీ అర్హత గల వారికి కూడా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని అన్నారు. 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023 జూలై 1వ తేదీ నుంచి పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, జీఓ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులు అప్‌గ్రేడ్ చేసి ఉద్యోగోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ తదితర సంఘాల నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, ఎన్.కృష్ణ, ఆర్.రమేష్‌కుమార్, బి.రాము, పాషా, ఆశాలత, సత్యశ్రీ, జి.హరిలాల్, వి.వరలక్ష్మి, బి.రాజు, పి.గంగరాజు, బి.హనుమంతు, డి. ఉమాదేవి, ఎండీ ఆసియా తదితరులు పాల్గొన్నారు.
యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో ధర్నా