
ఎమ్మెల్యే ఉపాధ్యాయుడైన వేళ..!
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠం బోధించడమే కాక చిన్నారులచే అక్షరాలు దిద్దించారు. మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు ఇదే ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠం బోధించి, అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు నేలపై కూర్చొని అక్షరాలు దిద్దించారు. అనంతరం వారికి అందిస్తున్న పోషకాహారం, వంట సరుకులు పరిశీలించారు.
డిగ్రీ కళాశాల
అధ్యాపకురాలికి పాముకాటు
అశ్వారావుపేటరూరల్: మండలంలోని పెదవాగు ప్రాజెక్ట్(దమ్మపేట)లో గల ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లిష్ అధ్యాపకురాలు భవానీ గురువారం పాముకాటుకు గురైంది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తోటి సిబ్బంది చెప్పారు.
సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు..
గురుకుల డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న కొత్త మెనూ ఏడాది కావొస్తున్నా.. అమలు చేయడం లేదని, కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వాన్నంగా ఉందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఫిర్యాదును ఖమ్మం ఆర్సీఓఅరుణకు పంపించి, విచారణ చేయవల్సిందిగా ఆమెను ఆదేశించారు.
తూరుబాక
పంచాయతీలో వివాదం
● మల్టీపర్పస్ వర్కర్లను వద్దన్నందుకు వాగ్వాదం
● నెలపాటు పనులకు రావొద్దని ఎంపీఓ సూచన
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి, మల్టీపర్పస్ వర్కర్‌ల మధ్య వివాదం చోటుచేసుకుంది. పంచాయతీలో కేంద్ర బృందం పర్యటన నేపథ్యాన పంచాయతీని శుభ్రంగా ఉంచేందుకు కార్యదర్శి, వర్కర్లు పనులు చేస్తున్నారు. ఈనేపథ్యాన మంగళవారం డంపింగ్ షెడ్ వద్ద మల్టీ పర్పస్ వర్కర్లు ఉదయమే పనులు పూర్తి చేయగా.. ఘటన స్థలానికి వచ్చిన కార్యదర్శి మీకు పని చేయడం రాదని అనడంతో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాని మిగతా ఇద్దరు సాయంత్రం వరకు పని చేశారు. మరుసటి రోజు బుధవారం కొత్త వ్యక్తులతో పంచాయతీ కార్యదర్శి పనులు చేయించారు. అలాగే గురువారం కూడా పాతవారిని పిలవకపోవడంతో వారు పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా.. తాము కొత్త వాళ్లను పెట్టుకున్నామని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఎంపీఓ రామకృష్ణ దృష్టికి పంచాయతీ కార్యదర్శి తీసుకెళ్లగా.. ఆయన అక్కడకు వెళ్లి ఒక నెల రోజుల పాటు విధులకు దూరంగా ఉండండని మల్టీ పర్పస్ వర్కర్లకు సూచించినట్లు తెలపగా.. వివాదం మరింత తీవ్రతరం అయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎంపీఓ రామకృష్ణను వివరణ కోరగా.. మల్టీపర్పస్ వర్కర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తిచడం లేదని, పంచాయతీలో కేంద్ర బృందం సర్వే ఉన్న నేపథ్యాన పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. వారిని ఒక నెల రోజుల పాటు పనులకు దూరంగా ఉండమని సూచించినట్లు తెలిపారు.
నాట్లు వేస్తుండగా గుండెపోటుతో రైతు మృతి
కొణిజర్ల: వరి నార్లు వేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రైతు మృతి చెందాడు. కొణిజర్లకు చెందిన బండారు పుల్ల య్య(63) గురువారం తన పొలంలో నారు కట్టలు పరిచేందుకు వెళ్లాడు. నార్ల కట్టలు మోస్తుండగా గుండెపోటుకు గురైన ఆయన కన్నుమూశాడు. పుల్లయ్యకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, సీపీఐలో కొనసాగుతున్న ఆయన మృతదేహం వద్ద జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు గడల భాస్కర్, ఎర్రా బాబు, దొండపాటి రమేష్, స్వర్ణ రమేష్, తోటపల్లి సీతారాములు, తాటి వెంకటేశ్వర్లు, తాటి నిర్మల, లతాదేవి, కళావతి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే ఉపాధ్యాయుడైన వేళ..!