
సెర్ప్‌లో కొనసాగుతున్న బదిలీలు
● 26 మంది ఏపీఎంల పోస్టింగ్ పూర్తి ● త్వరలో ఇతర సిబ్బంది కౌన్సెలింగ్
చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విభాగంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాస్థాయి అధికారి నుంచి సీసీ వరకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఇటీవల జిల్లా నుంచి ఆరుగురు డీపీఎంలను వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. పది రోజుల క్రితం ఏపీఎంలను బదిలీలకు ఉత్తర్వులు జారీ కావడంతో కొందరిని జిల్లా నుంచి ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాల నుంచి జిల్లాకు కేటాయించారు. వీరికి గత నెల 26న పోస్టింగ్ ఆర్డర్‌లు జారీ చేశారు. గురువారం రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వగా, శుక్రవారం వారికి కేటాయించిన స్థానాల్లో చేరారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఆరుగురు ఏపీఎంలు జిల్లాకు వచ్చారు. జిల్లాలో పనిచేస్తున్న 19 మంది ఏపీఎంలకు ఒక మండల నుంచి మరో మండలానికి స్థానచలనం కల్పించారు. జిల్లాలో అన్ని కేడర్లు కలిపి మొత్తం 156 మంది పని చేస్తున్నారు. ఇందులో ఏపీడీ, డీపీఎం, సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు ఉన్నారు. డీపీఎంలు, ఏపీఎంల బదిలీల ప్రక్రియ పూర్తి కాగా, ఇక సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కాగా సెర్ప్‌లో పదేళ్ల తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టారు. దీంతో పలువురికి ఊరట లభించనుంది. శుక్రవారం విధుల్లో చేరిన ఏపీఎంలు డీఆర్‌డీఓ విద్యాచందనను కలిశారు.