
హమాలీలకు భద్రత ఏది..?
● అందని ఈఎస్‌ఐ, పీఎఫ్, బీమా సదుపాయాలు ● పట్టించుకోని జీసీసీ, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు
ఇల్లెందు: గిరిజన సహకార సంస్థ(జీసీసీ), పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలు కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదు. పలుమార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. జిల్లాలో ఐదు జీసీసీ బ్రాంచీలు, ఐదు సివిల్ సప్లాయీస్ ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇల్లెందు జీసీసీలో 80మంది, పాల్వంచలో 25, భద్రాచలంలో 16, అశ్వాపురంలో 16, దమ్మపేటలో 15 మంది.. మొత్తం 168 మంది హ మాలీలు పనిచేస్తున్నారు. సివిల్ సప్లయీస్ విభా గం నుంచి బియ్యం, జీసీసీ నుంచి సరుకులు డీఆర్ డిపోలు, హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలకు రవా ణా చేస్తున్నారు. ఇటీవల మూడునెలల కోటా పంపిణీ కోసం హమాలీలు రాత్రీపగలు కష్టపడ్డారు. పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి ఈఎస్‌ఐ, పీ ఎఫ్, ఇన్సూరెన్సు, హెల్త్‌కార్డులు వంటి సదుపాయాలు కల్పించాలని హమాలీలు కోరుతున్నారు. హమాలీలకు క్వింటాల్‌కు రూ.29చొప్పున చెల్లిస్తున్నారు. ఏడాదికి రూ.7500 పారితోషికం, 2జతలబట్టలు, ఇతర సదుపాయాల కోసం రూ. 2500 చెల్లిస్తున్నారు. వీటి నుంచి ప్రతీ నెల రూ. 200 చెల్లిస్తే రూ.5లక్షల వరకు ఈఎస్‌ఐ సదుపాయం లభిస్తుంది. ఒకవేళ కార్మి కుడు మృతి చెందితే రూ.20 వేల దహన సంస్కారాల కోసం చెల్లిస్తారు. ఒక్కో హమాలీకి రూ. 22 చొప్పున పీఎఫ్ చెల్లిస్తే ఉద్యోగ విరమణ వయసు నాటికి సుమా రు రూ.7 లక్షలు వరకు చేతికి వచ్చే అవకాశం ఉంది. పింఛనూ లభిస్తుంది. ఏడాదికి రూ.వెయ్యి చెల్లిస్తే రూ. 20లక్షల వరకు ప్రమాద బీమా లభించే అవకాశం ఉంటుంది. ఇంకా సింగరేణి తరహాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంటే సింగరేణి కార్మికులకు జరిగినట్లు మరింత మేలు జరుగుతుంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఈపీఎఫ్ నిధులు చెల్లించకుండా జాప్యంచేస్తున్నట్లు హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుస్తుల కుట్టుకూలీ రూ.1600 చెల్లించా లని, ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచాలని కోరుతున్నారు.