
ఎనిమిదేళ్లుగా అవే పనులు..
● కిన్నెరసాని వాగుపై బ్రిడ్జికి మొక్షం ఎప్పుడో? ● ప్రమాదకరంగా బీసీఎం జాతీయ రహదారి ● 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా అసంపూర్తిగానే..
పాల్వంచరూరల్: జాతీయ రహదారి గుండా వెళ్తున్న కిన్నెరసానివాగుపై నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కొత్త బ్రిడ్జి మంజూరైనా పనులు మొదలు కాలేదు. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి వల్ల 24 గంటలూ రద్దీగా ఉండే బీసీఎం 30వ నంబర్ జాతీ య రహదారిపై ప్రమాదాలకు అవకాశం ఉంది. వాహనదారులు భయాందోళనల నడుమ రహదారిపై ప్రయాణించాల్సి వస్తోంది.
8 ఏళ్లుగా సాగదీత..
సారపాక నుంచి రుద్రంపూర్ వరకు మూడో ప్యాకేజీ కింద రూ.299 కోట్ల వ్యయంతో 42 కిలోమీటర్ల 30వ నంబర్ జాతీయ రహదారి పనులు 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఎనిమిదేళ్లుగా రోడ్డు పనులు దక్కించుకున్న కంపెనీ పూర్తిచేయ కుండా నిర్లక్ష్యంగా వదిలేసింది. ప్రధాన రహదారి పనులు అసంపూర్తిగా ఉండగా ఇంకా డ్రెయినేజీ, ఫుట్‌పాత్ పనులు కూడా పూర్తి కాలేదు.
అసంపూర్తిగానే..
ప్రధాన రహదారిపై సీతానాగారం, బస్వతారకకాలనీ, లక్ష్మీదేవిపల్లి, జీసీసీ కార్యాలయం నుంచి సీ–కాలనీ గేటు వరకు సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా మరో లేయర్ తారు నిర్మాణం చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో పాత తారు అంతా లేచిపోయి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కేశవాపురం సమీపంలో నిర్మించిన క్వలర్టు వద్ద కొద్దిరోజులకే రోడ్డు కుంగిపోగా తిరిగి మరమ్మతులు చేశారు. వర్షాటలకు తిరిగి కోతకు గురైంది. అక్కడే నడిరోడ్డుపై గుంత ఏర్పడటంతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో నిర్మించిన రోడ్డుకు బీటలువారింది. జగన్నాథపురం, నాగారంకాలనీ మధ్య ఆర్‌టీఏ చెక్‌పోస్టు వద్ద రోడ్డు దెబ్బతింది. ఇంకా ఫూట్‌పాత్ పనులు పూర్తి చేయకపోవడంతో డ్రెయినేజీ, వర్షం నీరు రహదారిపై ప్రహహిస్తోంది. కాగా, రోడ్డు మధ్యలో డివైడర్లను కూడా అసంపూర్తిగానే నిర్మించారు.
బ్రిడ్జి మంజూరై ఏడాది..
బీసీఎం జాతీయ రహదారిలోని రంగాపురం వద్ద గల కిన్నెరసాని వాగుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. గతేడాది కిన్నెరసాని వాగు పొంగిపొర్లడంతో వరద నీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహించింది. బ్రిడ్జి చివరలో కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలు నిలిపివేసి పాండురంగాపురం ఉప్పసాక మీదుగా మళ్లించి, తాత్కాలిక మరమ్మతులు నిర్వ హించారు. దీంతో 2024లో రూ.22 కోట్లను బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించారు. గతేడాది పనులను ప్రారంభిస్తామని చెప్పినా ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఈ పనులకు ఢిల్లీ నుంచి సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని చెబుతున్నారు. అనుమతులు రాగానే టెండర్లు పిలుస్తామని హైవే అథార్టీ అధికారి ఒకరు చెప్పారు. కాగా, వానాకాలం వరదలు వస్తే భద్రాచలం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదరయ్యే అవకాశం ఉంది. అధికారులు బ్రిడ్జి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను త్వరితగతిన ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
కాంట్రాక్ట్ రద్దు కోసం ప్రతిపాదనలు..
బీసీఎం హైవే పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. రంగాపురం వద్ద కిన్నెరసానివాగుపై బ్రిడ్జి నిర్మా ణానికి టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. టెక్నికల్ అనుమతులు రావాల్సి ఉంది. 20 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన ఫుట్‌పాత్, డ్రెయినేజీ పను లు పూర్తిచేయాల్సి ఉంది. కొంతదూరం మరో లేయర్ తారు వేయాల్సి ఉంది. పలుమార్లు కంపెనీ కాంట్రాక్టర్‌కు నోటీసులు కూడా జారీచేశాం. అయి నా స్పందించడం లేదు. కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసి కొత్తవారికి పనులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపించాం.
–యుగంధర్, ఎన్‌హెచ్ ఈఈ

ఎనిమిదేళ్లుగా అవే పనులు..