
అడ్మిషన్లకు ‘అటానమన్’ ఎర!
● రామచంద్ర డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల రగడ ● అటానమస్ ఆశచూపి సీట్ల కేటాయింపు ● అడ్మిషన్ల రద్దుపై భిన్న వాదనలు ● ప్రశ్నార్థకంగా కళాశాల ఉనికి
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామ చంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల వ్యవహారం తీవ్ర దుమారం లేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నూతన ప్రవేశాలను కల్పిస్తోంది. ఆన్‌లైన్ ప్రక్రియ విధానంతో కౌన్సెలింగ్ పద్ధతిన విద్యార్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. అయితే మొదటి మూడు దశల్లో రామచంద్ర డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అడ్మిషన్లు బాగానే జరిగాయి. చివరిదైన నాలుగో దశ ఈ నెల 20 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగనుంది.
అంతా సవ్యంగా ఉందనుకుంటే..
ఇప్పటివరకు సాఫీగా జరిగిన అడ్మిషన్ల ప్రక్రియతో అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయాన అకస్మాత్తుగా పదుల సంఖ్యలో విద్యార్థులు వారి అడ్మిషన్లను వెనక్కు తీసుకోవడంపై కళాశాల సిబ్బందికి షాక్ గురయ్యారు. న్యాక్ బీ ప్లస్ పొందిన కళాశాల, అందులో ఎంతో చరిత్ర కలిగి విద్యాప్రమాణాలకు పెద్దపీఠ వేసే సిబ్బంది ఉన్న కళాశాలను కాదని వారి అడ్మిషన్లు రద్దు చేయమంటూ స్వయంగా విద్యార్థులు కోరడం ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది.
అడ్మిషన్ల రద్దుపై భిన్నాభిప్రాయాలు..
కళాశాలలో అడ్మిషన్ల రద్దుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కళాశాలకు చెందిన కీలక హోదాలో ఉన్న ఓ వ్యక్తి అడ్మిషన్ల రద్దును ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ ప్రయోజనం కోసం విద్యార్థుల భవిష్యత్‌తో చలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాల్వంచ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీరామచంద్ర కళాశాలకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రామచంద్ర డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సెలవుల్లో ఉండడంతో ఆ స్థానంలో స్థానిక సిబ్బందిని కాకుండా ఇతర కాలేజీ వారిని ప్రిన్సిపాల్‌గా నియమించడం కళాశాల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సిబ్బంది ఇదేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుంటే, మరికొందరు మాత్రం కొత్తగా వచ్చిన ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నియామకమే అందుకు కారణమంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, తక్షణమే విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.