
దిగుబడి.. తిరగబడి!
గెలలు.. వాహనాల బారులు
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల లోడుతో అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తున్న ట్రాక్టర్లు బారులుదీరుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఫ్యాక్టరీకి భారీగా గెలలు తీసుకొస్తుండగా.. ఫ్యాక్టరీ వద్ద గల ప్లాట్‌ఫామ్ గెలలతో నిండిపోయింది. దీంతో దిగుమతి చేసేందుకు స్థలం లేక ఆలస్యమవుతుండడంతో రోడ్డు పొడవునా గెలలతో ట్రాక్టర్లు పోటెత్తాయి. దాదాపు 70 నుంచి 80 ట్రాక్టర్లు రోడ్డుపై ఉండాల్సి వస్తుండగా.. ఒక్కో ట్రాక్టర్ దిగుమతికి రెండు గంటలపైనే పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. గురువారం ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు బారులుదీరగా.. ‘సాక్షి’తన కెమెరాలో క్లిక్ మనిపించింది.
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని దమ్మపేట మండలంలో ఈ ఏడాది ఆయిల్‌పామ్ దిగుబడి గణనీయంగా తగ్గిందని సాగు చేసిన చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక ఒక టన్ను పామాయిల్ గెలల ధర రూ.20 వేల పైచిలుకు నుంచి క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం తగ్గడంతో ఒక్కసారిగా రూ.17 వేలకు పడిపోవడంతో రైతులు నిరాశజనకంగా ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ఒక ఎకరానికి ఒక టన్ను నుంచి రెండు టన్నుల మేర దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. కాగా, ఈ దిగుబడి తగ్గడానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని పేర్కొంటున్నారు.
దిగుబడి ఇలా..
పామాయిల్ మొక్కలను నాటిన తర్వాత నాలుగేళ్ల నుంచి గెలల దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి మూడేళ్లలో పోషక విలువలతో కూడిన ఎరువులు, మొక్కకు సరిపడా నీటిని అందించడం తదితర యాజమాన్య పద్ధతులను సరైన సమయాన పాటిస్తే నాల్గవ ఏడాది నుంచి దిగుబడి పొందవచ్చు. ఇలా ప్రారంభమైన దిగుబడి ఆరవ ఏడాది వరకు ఏడాదికి ఒక ఎకరానికి సగటున మూడు నుంచి నాలుగు టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తుంది. ఏడవ సంవత్సరం నుంచి తొమ్మిదవ సంవత్సరం వరకు ఐదు నుంచి ఎనిమిది టన్నులు, పదవ సంవత్సరం నుంచి తొమ్మిది నుంచి పది టన్నులు పైచిలుకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇలా ముప్పై ఏళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.
కాలానుగుణంగా మార్పులు..
పామాయిల్ దిగుబడి అనేది కాలానుగుణంగా మారుతుంది. వేసవికాలంలో దిగుబడి తక్కువగా ఉండి వర్షాకాలం, శీతాకాలాల్లో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పదేళ్ల వయసున్న పామాయిల్ తోట, వేసవికాలంలో ఒక ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి ఇస్తే, వర్షాకాలం, శీతాకాలాల్లో 10 టన్నుల పైచిలుకు ఇచ్చే అవకాశం ఉంది. మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఇదే కాలంలో సగటున సంవత్సారానికి 10 టన్నుల గెలల దిగుబడి పొందొచ్చు.
దిగుబడి తగ్గడానికి కారణాలు
వాతావరణ మార్పులు, అడవుల నిర్మూలన, వ్యాధులు, వైరస్ తెగుళ్లు, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణలలో లోపాలు వంటి పలు అంశాలు పామాయిల్ దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు. కాగా, వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు పంట దిగుబడిని ప్రభావితం చేసి ఉండవచ్చనే ఆలోచన రైతుల్లో ఉంది. మండలంలో పామాయిల్ సాగులో దాదాపుగా 30ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రైతులే ఉన్న కారణంగా యాజమాన్య, సస్యరక్షణ పద్ధతుల్లో లోపం వచ్చే అవకాశం దాదాపుగా ఉండదని, ఒకవేళ ఉంటే వాటిపై రైతులకు సంబంధిత అధికారులు తగు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆయిల్‌పామ్ ప్రాభవానికి మసక
తగ్గిన పంట దిగుబడి
టన్నుకు రూ.3వేలు నష్టం
కారణం తెలియక రైతుల ఆందోళన
నష్టపోకుండా చూడాలని వేడుకోలు

దిగుబడి.. తిరగబడి!