
గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయింది. దీంతో స్పందించి ఆరా తీయగా ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల వర్షంలో తడవడంతో 30 మంది విద్యార్థులకు జ్వరం రాగా కొందరు ఇళ్లకు వెళ్లారని తేలగా, మిగతా వారికి చికిత్స చేయించారు. ఉన్నతాధికారులు కాలేజీ ప్రిన్సిపాల్ అన్వేష్‌తో మాట్లాడడంతో బుధవారం నిర్వహించిన హెల్త్ క్యాంప్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని తేలినట్లుగా చెప్పారు. అలాగే, కళాశాలను ఐడీఎస్‌పీ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పుల్లారెడ్డి, ఇమానియాల్ వంటగది, తాగునీటిని పరిశీలించి ఆహారం, తాగునీటిలో ఎలాంటి కలుషితం కాలేదని నివేదిక రూపొందించారు. ఇక గురుకులాల ఆర్‌సీఓ అలివేలు కూడా వివరాలు సేకరించారు. కాగా, విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వహించిన వైద్యం చేయించాలని ఏఐఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వరక అజిత్ ఆధ్వర్యాన నాయకులు కళాశాలను సందర్శించి వివరాలు సేకరించారు.