ఫుడ్ కోర్టు పూర్తయ్యేనా..?
● కిన్నెరసానిలో అసంపూర్తిగా నిలిచిన భవనం ● పర్యాటకులకు అల్పాహారం కూడా దొరకని దుస్థితి
పాల్వంచరూరల్: పర్యాటకుల కోసం కిన్నెరసాని డ్యామ్ పక్కన చేపట్టిన ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కిన్నెరసానిలో 9 కాటేజీలు, అద్దాలమేడ, ఫుడ్ కోర్టు నిర్మాణంకోసం 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10.77 కోట్లు మంజూరు చేశారు. ఆపసోపాలతో కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణ పనులు పూర్తిచేసిన అధికారులు ఫుడ్ కోర్టును మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు. గతంలో చెక్కతో ఫుడ్ కోర్టు నిర్మించారు. దానిని కూల్చివేసి రెండు అంతస్తుల భవనం నిర్మించాలని పనులు ప్రారంభించారు. నిధులేమితో అర్ధంతరంగా నిలిపివేశారు. మరోవైపు డ్యామ్‌పైకి వచ్చిన పర్యాటకులకు టీ, అల్పాహారం కూడా దొరకడంలేదు. ఇప్పటికై నా టూరిజం శాఖ అధికారులు స్పందించి ఫుడ్ కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. కాగా నిధులలేమి కారణంగా ఫుడ్ కోర్టు నిర్మాణ పనులను నిలిపివేయాల్సి వచ్చిందని టూరిజంశాఖ డీఈ రవీందర్ తెలిపారు.


