భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో సక్రమంగా విధులు నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లైజన్, సెక్టోరియల్ అధికారులతోపాటు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లను, అనారోగ్యంతో ఉన్న వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు అస్వస్థతకు గురైతే సమీపంలోని వైద్య శిబిరానికి తరలించాలన్నారు. విధుల్లో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత కలెక్టర్ రామయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఐటీడీఏ పీవో బి. రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్‌డీఓ విద్యాచందన, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ ఎల్.రమాదేవి పాల్గొన్నారు.


