పెద్దమ్మతల్లికి భోగి పండ్లతో అభిషేకం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి భోగి పండుగ సందర్భంగా బుధవారం రేగుపండ్లతో అభిషేకం నిర్వహించారు. భక్తులు భోగి పండ్లు, పూలు అందించగా వితరణ చేయగా వాటితో ఆలయం చట్టూ ప్రదక్షిణ నిర్వహించాక పెద్దమ్మతల్లితో పాటు శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశర్వర స్వామి ఆలయంలోని అమ్మవార్లకు అభిషేకం గావించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
ప్రతీ మొక్కను బతికించాలి
దమ్మపేట: నాటిన ప్రతీ కొబ్బరి మొక్క బతికేలా చూడాల్సిన బాధ్యతను సర్పంచ్, గ్రామస్తులు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని శ్రీరాంపురంలో రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి మొక్కలను నాటే కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొబ్బరి మొక్కలు పెరిగి, ఫలసాయం అందేవరకు వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతకుముందు మండలంలోని గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నివాసంలో పలువురు నాయకులు, అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, నున్నా రత్నారావు, దొడ్డా ప్రసాద్, కాసాని నాగప్రసాద్, కేవి పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్
సంక్రాంతి శుభాకాంక్షలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతి పెద్ద పండుగైన సంక్రాంతి ప్రతీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్దమ్మతల్లికి భోగి పండ్లతో అభిషేకం


