సరిహద్దుల్లో సందడి
తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో తరలిన పందెంరాయుళ్లు
వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం
బూర్గంపాడు/చండ్రుగొండ/అశ్వారావుపేటరూరల్ : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాకు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో బుధవారం బిర్రులు ఏర్పాటుచేయగా.. మూడు రోజుల పాటు యథేచ్ఛగా కోడిపందేలు నిర్వహించనున్నారు. తొలిరోజు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచే వేలాది మంది కోళ్లతో సహా పరుగులు తీశారు. కోడి పందేలు కాయడంతో పాటు వీక్షించేందుకు మోటార్‌సైకిళ్లు, కార్లు, ఆటోల్లో తరలివెళ్లారు. సరిహద్దున ఉన్న ఏపీలోని గ్రామాల్లో కోడి పందేలకు హాజరైన వారిలో 80 శాతం మంది జిల్లా వాసులే ఉండడం గమనార్హం. కోడిపందేలతో పాటుగా పేకాట కూడా భారీగా సాగింది. జిల్లాతో పాటు హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా పలువురు కార్లలో కోడి పందేలకు తరలిరావడం కనిపించింది. వందలాది వాహనాలకు సరైన పార్కింగ్ సౌకర్యం లేక రోడ్డుపైనే నిలిపేయడంతో రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ పోలీసులు కూడా మొక్కుబడిగానే బందోబస్తును పర్యవేక్షించారు.
కాయ్ రాజా కాయ్..
బూర్గంపాడు సమీపంలోని వేలేరు, శ్రీధర, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దుల్లోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, వేలేరుపాడు మండలం మేడేపల్లి, బండ్లబోరు, భూదేవిపేట, కుక్కునూరు మండలం లంకాపల్లి, కివ్వాక, కుక్కునూరు ప్రాంతాల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. జిల్లాలోని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో సైతం కోడి పందేలు సాగడం గమనార్హం.
ఏపీ పరిధిలోని గ్రామాల్లో జోరుగా కోడిపందేలు
సరిహద్దుల్లో సందడి


