గాలి ‘పాఠాలు’
లెక్కలన్నీ కుదిరితేనే పతంగి ౖపైపెకి..
ప్రతీ అంశంలో గణితం, సైన్స్ సమ్మిళితం
ఖమ్మం మయూరిసెంటర్: గాలిపటం ఎగురవేయడమంటే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ సరదానే! సంక్రాంతి వస్తుండగానే గాలిపటాలు అమ్మకాలు మొదలై.. పండుగ సెలవులు రాగానే జోరందుకుంటాయి. గాలిపటం తయారీ, కన్నాలు పెట్టి దారం కట్టడం, ఎగురవేయడంలో పిల్ల లకు పెద్దలు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఇందులో ప్రతీ అంశంలో గణితం, సైన్స్ సూత్రాలు సమ్మిళతమై ఉంటాయని మీకు తెలుసా!? అవేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..
దారం.. కీలకం
గాలిపటం ఎంత అందంగా ఉన్నా అది ఎగరాలంటే దారమే కీలకంగా నిలుస్తుంది. దారం తయారీకి పిండి, గాజు పొడి, రంగులు ఇవన్నీ సమపాళ్లలో కలపాలి. ఇందులో కాస్త ఎక్కువైనా, తక్కువైనా దారం బలం సరిగ్గా ఉండదు. దారం మందం, పొడవు సరిగ్గా అంచనా వేయడం ద్వారా నిష్పత్తులు, శాతాలపై అనుభవం వస్తుంది. అయితే, గతంలో చాలామంది ఇళ్లలో దారాలు ప్రత్యేకంగా సిద్ధం చేసుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో రెడీమేడ్‌గానే లభిస్తున్నాయి.
కన్నాలు కుదరాల్సిందే..
పతంగి ఎగురవేయడంలో కన్నాలు ప్రధానం. బెజ్జాలు సరిగ్గా వేయకపోతే గాలిపటం ఓ వైపు వంగుతూ సరిగ్గా ఎగరదు. రెండు కన్నాలు సమాన పొడవులో ఉండేలా చూడాలి. ఇది తెలిస్తే కొలతల ప్రాధాన్యత, కోణాల గణితంపై అవగాహన వస్తుంది.
గాలివాటం గుర్తింపు
గాలిపటం, దారం సిద్ధం చేసుకున్నాక ఎగురవేయడంలోనూ సరైన అంచనా ఉండాల్సిందే. గాలి వేగం, మార్గాన్ని సరిగ్గా అంచనా వేస్తే గాలిపటం సులువుగా ఎగురేయొచ్చు. అంతేకాక గాలి దిశ ఆధారంగా దారం వదలాలా, దింపాలా అన్నది నిర్ణయించుకోవచ్చు. గాలి బలంగా ఉన్నప్పుడే దారం వదులుతూ.. తగ్గగానే పట్టి ఉంచాలి. ఈ క్రమంలో పిల్లలు భౌతికశాస్త్రం(ఫిజిక్స్)లోని వేగం, బలం, దిశ అంశాలను అర్థం చేసుకుంటారు.
జాగ్రత్తలు...
పతంగులు ఎగురవేయడం అందరికీ సరదానే అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పనిసరి. అంచు గోడలు ఉన్న డాబాలపైనే ఎగురవేయడం, విద్యుత్ తీగలకు దూరంగా ఉండడం.. ప్రమాదకారిగా మారిన చైనా మాంజా వాడితే నష్టాలపై పిలల్లకు వివరించాలి. తద్వారా వారికి భద్రతా చర్యలు కూడా తెలిసొస్తాయి.


