వందేళ్ల వేడుకలకు సిద్ధం
● ఖమ్మం సభకు భారీగా తరలనున్న జనం ● సీసీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థ కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లిపోయింది. అందువల్ల ఎన్నికల ఫలితాలను చూసి కమ్యూనిస్టులు బలహీనపడిపోయారనే వాదనలు వినిపించేవారు పెరిగారు. కానీ ఇప్పటికీ క్షేేత్రస్థాయిలో ఎర్రజెండా పునాదులు బలంగానే ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా తెలిపారు. జనవరి 18న ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహిస్తున్న వందేళ్ల వేడుకల ఏర్పాట్లు, జిల్లాలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై వివరాలు ఆయన మాటల్లోనే..
అందుకే ఖమ్మంలో..
ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా సీపీఐకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటోంది. అందుకే ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించాం. ఈ సభకు జాతీయ స్థాయి నేతలు వస్తారు. ఆ మేరకు వసతి ఏర్పాట్లు చేయాలి. కొత్తగూడెంతో పోల్చితే ఖమ్మంలో వసతి సౌకర్యాలు మెరుగు, పైగా దేశంలోని ప్రధాన నగరాలతో రైలు కనెక్టివిటీ కూడా ఉంది. అందువల్లే ఈ సభలకు ఖమ్మంను వేదికగా చేసుకున్నాం.
భారీ ఎత్తున సభకు..
రేపు జరగబోయే సీపీఐ వందేళ్ల మహాసభకు జిల్లా నుంచి 70వేల మందిని తరలిస్తున్నాం. ఇందుకోసం 600ల బస్సులు, మరో ఆరువందల వరకు ఇతర వాహనాలు, 500 వరకు కార్లు ఏర్పాటు చేశాం. సభ సమన్వయం కోసం రెండు వేల మందితో జనసేవాదళ్‌ను ఇప్పటికే సిద్ధం చేశాం. కవాతు, గిరిజన నృత్యాలు, సింగరేణి కార్మికులు, వివిధ ప్రజా సంఘాలతో ర్యాలీగా సభకు వెళ్లబోతున్నాం.
లక్షల గొంతుల నుంచి
జిల్లాలో సీపీఐ ఎప్పుడూ బలంగానే ఉంది. 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవాలో కాంగ్రెస్ సైతం కనుమరుగైంది. అప్పుడు కూడా మాకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా లక్ష గొంతుల జనగర్జన సభను మా పార్టీ తరఫున 2023 జూన్‌లో కొత్తగూడెంలో నిర్వహించాం. ఆ తర్వాత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం దక్కించుకున్నాం. అప్పటి నుంచి క్రమంగా మా పార్టీ పుంజుకుంటోంది. ఆ సమయంలో జిల్లాలో 600 గ్రామశాఖలు ఉండగా ఇప్పుడా సంఖ్య 870కి పెరిగింది. చాలా మండల కేంద్రాల్లో పార్టీకి సొంతంగా కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచే ప్రజా పోరాటాలను నిర్మిస్తున్నాం.
బలం పెరిగింది
ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో 51 మంది సర్పంచ్‌లు, 60 మంది ఉప సర్పంచ్‌లు, 482 మంది వార్డుమెంబర్లుగా మా పార్టీ బలపరిచిన వారు గెలిచారు. సార్వత్రిక ఎన్నికల తరహాలోనే రాబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్–సీపీఐ కూటమి ఐక్యతతో పోటీ చేయాలని ఆశిస్తున్నాం. మా బలానికి తగ్గట్టుగా సీట్ల కేటాయింపులు లేని పక్షంలో ఒంటరిగా లేదా మాతో కలిసి వచ్చే భావసారుప్యత కలిసిన రాజకీయ పక్షాలతో కలిసి ముందుకు వెళ్తాం. ఈ మేరకు మా పార్టీ తరఫున ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది.


