పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం జరిపారు. శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో రెండు రోజులుగా భక్తుల సందడి నెలకొంది. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతం అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాల్యమిత్రులను
కలిసిన మంత్రి తుమ్మల
దమ్మపేట: బాల్యమిత్రులు, సమీప బంధువులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మండలంలోని గండుగులపల్లి, నాగుపల్లి గ్రామాల్లోని బాల్య మిత్రులు, బంధువుల ఇళ్లకు మంత్రి తుమ్మల స్వయంగా వెళ్లి, వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారితో గత స్మృతులను నెమరవేసుకుని సరదాగా కాసేపు ముచ్చటించారు. గండుగులపల్లి నివాసంలో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.
కిన్నెరసానిలో
సంక్రాంతి సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సంక్రాంతి సందడి నెలకొంది. గురు, శుక్రవారాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 750 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.63,525 ఆదాయం లభించింది. 580 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ. 35,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మేడారం ఆర్టీసీ
చార్జీల వెల్లడి
ఇల్లెందు: ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వసూలు చేసే టికెట్ రేట్లను శుక్రవారం ప్రకటించింది. ఖమ్మం నుంచి కొత్తగూడెం– మణుగూరు–ఏటూరు నాగారం మీదుగా వెళ్తే మేడారం 245 కిలోమీటర్ల దూరం ఉండగా, ఇల్లెందు మీదుగా వెళ్తే 177 కిలోమీటర్లు ఉంటుంది. అయితే బస్సు సర్వీసులు కొత్తగూడెం మీదుగా నడుపుతున్నారు. ఇల్లెందు మీదుగా కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం


