ఏదీ భరోసా?
యాసంగి సీజన్‌లో ముమ్మరంగా వ్యవసాయ పనులు
సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఊరించిన ప్రభుత్వం
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు
ఇంకా మార్గదర్శకాలు రాలేదు
సత్వరమే ఇవ్వాలి
ఏడాది సీజన్ రైతులు నగదు
2018–19 వానాకాలం 1,10,299 147.80
2018–19 యాసంగి 1,02,490 130.32
2019–20 వానాకాలం 1,08,392 143.81
2019–20 యాసంగి 82,248 91.68
2020–21 వానాకాలం 1,30,519 201.74
2020–21 యాసంగి 1,33,348 204.71
2021–22 వానాకాలం 1,33,711 204.45
2021–22 యాసంగి 1,34,192 205.15
2022–23 వానాకాలం 1,34,764 205.18
2022–23 యాసంగి 1,33,318 202.72
2023–24 వానాకాలం 1,72,533 261.07
2023–24 యాసంగి 1,77,646 268.16
2024–25 యాసంగి 1,37,718 163.20
2025–26 వానాకాలం 1,78,380 318.69
సూపర్‌బజార్(కొత్తగూడెం): యాసంగి సీజన్ ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన సర్కారు ఆచరణలో మొండిచేయి చూపింది. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రూ. 6 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 12 వేలను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టబడి సాయం జమ చేస్తోంది. అయితే పథకాన్ని పకద్బందీగా అమలు చేయాలని భావించిన ప్రభుత్వం పంట పొలాలను శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ చేసిన తర్వాత అమలు చేయాలని నిర్ణయించిందని, అందుకే జాప్యం జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. ఈసీజన్ వరకు గతం మాదిరిగానే రైతు భరోసా అందించాలని కూడా భావిస్తున్నటు ప్రచారం జరిగింది. దీని ప్రకారం జిల్లాలో గత యాసంగిలో నమోదైన 1,37,718 మంది రైతులకు రూ.163.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే అప్పులు చేసి పంటలు వేశామని, రైతు భరోసా విడుదల చేస్తే ఉపశమనం కలుగుతుందని రైతులు కోరుతున్నారు. వానాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు, యూరియా కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులను కూడా చిన్న, సన్నకారు రైతులు సాధించలేక పోయారు. వానాకాలం సీజన్‌లో రైతు భరోసా అందించడంతో కొంత ఊరట కలిగింది. యాసంగికి కూడా భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు. గత నెల రోజుల నుంచి మాత్రమే వ్యవసాయపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు విడుదల కాగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.
–వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
రైతులకు పెట్టబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతు భరోసాను సత్వరమే మా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. వానాకాలంలో పత్తివల్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. అధిక వర్షాలు మమ్మల్ని నష్టాల పాలు చేసింది. రైతు భరోసాను విడుదల చేసి ఆదుకోవాలి.
–మల్లయ్య, రైతు, గరీబ్‌పేట
ఏదీ భరోసా?
ఏదీ భరోసా?
ఏదీ భరోసా?


