‘కమిషన్’పై ఆసక్తి
మళ్లీ ప్రాభవం తెచ్చేలా..
రాష్ట్ర విభజనతో చెల్లాచెదురైన భద్రాచలం జిల్లాల విభజనతో మూడు ముక్కలైన ఇల్లెందు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తొమ్మిదేళ్లుగా అసంతృప్తులు, నిట్టూర్పులకే పరిమితమైన జిల్లాల పునర్విభజన అంఽశంలో కదలిక వచ్చింది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవ్యస్థీకరణపై సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హై కోర్టు రిటైర్డ్ జడ్జితో ఉన్నతస్థాయి కమిషన్ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన హేతుబద్ధంగా జరగలేదని, కేవలం అప్పటి పాలకుల సెంటిమెంట్లు, వ్యక్తిగత గొప్పల కోసమే ఇష్టారీతిగా జిల్లాలను విభజించారని, అప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి, సీఎంల నుంచి వరుసగా ప్రకటనలు రావడంతో జిల్లాల పునర్విభజన, పునర్వవ్యస్థీకరణలకు సంబంధించిన ప్రకటన ఆశామాషీగా రాలేదని, ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భద్రాచలం, ఇల్లెందు నియోజకర్గాల ప్రజలు త్వరలో ఏర్పాటు కాబోయే కమిషన్‌పై ఆసక్తిగా ఉన్నారు.
రాష్ట్ర విభజనతో..
జిల్లాల విభజనకంటే ముందే చిన్నాభిన్నమైన నియోజకవర్గంగా భద్రాచలం ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరంలతోపాటు భద్రాచలం గ్రామీణ ప్రాంతం ఏపీలోకి వెళ్లిపోయింది. దీంతో రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా పేరున్న భద్రాచలం పరిధి తగ్గిపోయింది. కేవలం భద్రాచలం పట్టణం, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకే పరిమితమైంది. 2016లో జరిగిన జిల్లాల పునర్విభజనతో మరోసారి భద్రాచలం అతలాకుతలమైంది. వాజేడు, వెంకటాపురం మండలాలు ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి, ఆ తర్వాత ములుగు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఒకప్పుడు రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గంగా పేరున్న భద్రాచలం జనాభా పరంగా అతి చిన్న నియోజకవర్గంగా మారిపోయింది.
మూడు ముక్కలు
జిల్లాల పునర్విభజన 2016లో జరిగినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకర్గాలు ఒకే జిల్లా పరిధిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనివార్య కారణాల వల్ల కొన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. కానీ ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం అనూహ్యంగా మూడు ముక్కలైంది. బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లగా కామేపల్లి ఖమ్మం జిల్లాలో ఉంది. కేవలం ఇల్లెందు, టేకులపల్లి మండలాలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. గ్రామపంచాయతీలకు సంబంధించి పనులు చేయించుకోవాలంటే ఇల్లెందు ఎమ్మెల్యే మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు అక్కడి జిల్లా అధికారులను కలవాల్సి వస్తోంది. అనివార్యమైతే తప్ప ఎక్కువగా జిల్లా కేంద్రమైన ఇల్లెందు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలకే ఎమ్మెల్యే పరిమితం కావాల్సి వస్తోంది.
సమగ్రత వస్తేనే..
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఇల్లెందు పట్టణంతోపాటు నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉంది. పారిశ్రామిక ప్రగతి ఆగిపోయింది. కనీసం సాగురంగంలోనూ చెప్పుకోతగ్గ పురోగతి లేదు. సీతారామ ప్రాజెక్టు ఫలాలు అందేది గగన కుసుమంగా మారింది. కనీసం చిన్న లిప్టుల కోసం ప్రయత్నించాలన్నా మూడు జిల్లాలకు చెందిన అధికారులు, అక్కడి రాజకీయ పార్టీల మద్దతు అవసరం పడుతుంది. ఈ తరహా చిక్కుల నుంచి తప్పించాలనే డిమాండ్లు గడిచిన తొమ్మిదేళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్విభజన అంశంపై రాష్ట్ర సర్కారు ఫోకస్ చేయడంతో ‘ఇల్లెందు’ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇల్లెందు, మణుగూరులకు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించాలని, కొత్తగా కొమురారం, బోడు, మొండికుంట, వినాయకపురం మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తొమ్మిదేళ్లుగా నానుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటి నుంచి భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంటూనే పరిపాలనలోనూ గుండెకాయలా ఉంటూ వచ్చేది. ఇక్కడే అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీలు ఉండేవారు. ఐటీడీఏ భద్రాచలంలో మరో ఐఏఎస్ అధికారి ఉంటూ స్థానిక గిరిజనుల అభివృద్ధికి పాటుపడేవారు. రాష్ట్ర విభజన, ఆ తర్వాత జిల్లాల విభజనతో భద్రాచలం ప్రాభవం గతానికే పరిమితమైంది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో ఏజెన్సీ ప్రాంతానికి భద్రాచలం పెద్ద దిక్కుగా ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరంగానే కాకుండా కేంద్రం పరంగా కూడా ఇక్కడ భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించే సమయంలో ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలిపే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
త్వరలో జిల్లాల పునర్వవ్యస్థీకరణ కమిషన్


