మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లు ప్రారంభం
సూపర్‌బజార్(కొత్తగూడెం): 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని సూచించారు. జిల్లాలో కొత్తగూడెంలో బాలికలకు, బాలురకు, బూర్గంపాడు బాలికలకు, భద్రాచలం బాలురకు, అశ్వారావుపేట బాలికలకు, ఇల్లెందులో బాలికలకు గురుకులాలు ఉన్నాయని తెలిపారు. తొలుత ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కాగా మైనారిటీ గురుకులాల నాణ్యమైన ఉచిత విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే సంజీవరావు తన కార్యాలయంలో విడుదల చేశారు. తల్లిదండ్రులు వివరాల కోసం పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ, అభివృద్ధి అధికారి కే.సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎంజే అరుణ కుమారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా విజిలెన్స్ అధికారులు కే సీతారాములు, ఎంఏ రవూఫ్, జిల్లాలోని మైనారిటీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


