రూ.కోట్లు ఎరచూపినా వెనక్కి తగ్గని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యే చేతులు పట్టుకుని బతిమలాడిన ససేమిరా అన్న ఎంపీటీసీలు చివరకు అధికారులను అడ్డంపెట్టుకుని ఎన్నిక వాయిదా వేయించిన వైనం టీడీపీ నాయకులను వదిలేసి వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసుల లాఠీచార్జీ ప్రశాంత బాపట్లలో టీడీపీ అరాచకం
ఆర్వో మార్పులోనే కుట్రలు
ఎంపీపీ పదవి కోసం టీడీపీ కుయుక్తులు
అసలేం జరిగింది..!
బాపట్ల: బాపట్ల ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ కుట్రలు కుతంత్రాలకు పాల్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 8 స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకోగా ఏడు మాత్రమే టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో ఒక స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. రూ.కోట్లు ధనం, అధికారం ఎరగా చూపి ప్రలోభాలకు గురి చేసింది. కుటుంబ సభ్యులు, బంధుగణాలతో ఒత్తిడి తెచ్చారు. అయినా లొంగకపోవడంతో చివరికి బతకనివ్వమంటూ పోలీసులచే లాఠీచార్జీలు కూడా పలుదఫాలుగా చేయించారు. ఎన్ని చేసిన తామంతా ఒక్కటేనని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు నిరూపించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాగిన ఎంపీపీ ఎన్నిక ప్రహసనం ఒక కొలిక్కి రాకపోవటంతో అధికార బలంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేయించారు.
వైఎస్సార్ సీపీ నాయకులపై లాఠీచార్జీ
ఎంపీడీఓ కార్యాలయం పరిసరాల్లో టీడీపీ నాయకు లు యథేచ్ఛగా తిరుగాడుతూ కనిపించారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులను ఆ దరిదాపుల్లోకి కూడా పోలీసులు రానివ్వలేదు. కనీసం రోడ్లపై కూడా నిలబడకుండా లాఠీచార్జీ చేసి తరమికొట్టారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బాపట్ల మండలంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శివలీలను ఎంపీపీ ఎన్నిక విధుల నుంచి తప్పించటంపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పారీ ఒత్తిళ్లను ఆమె పట్టించుకోకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించటం వల్లే ఆర్వో బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
బాపట్ల ఎంపీపీ ఎన్నిక మధ్యాహ్నం ఒంటిగంటకు నందిరాజుతోట వద్ద గల ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని ప్రకటించారు. అప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుగానే కేంద్రంలోకి అనుమతించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను మాత్రమే అనుమతించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు లోనికి వెళ్ళిన దగ్గర నుంచి ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు స్వయంగా ప్రలోభాలకు గురి చేయటం ప్రారంభించారు. చేతులు పట్టుకుని మరీ బతిమలాడినప్పటికీ వైఎస్సార్ సీపీ నాయకులు ఎవరూ లొంగలేదు. చివరికి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల కుటుంబ సభ్యులను కూడా లోపలికి తీసుకుపోయి ఒత్తిళ్లు చేయించారు.
అయినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు ఏ మాత్రం లొంగలేదు. ఇంట్లో చిన్న పిల్లల భవిష్యత్తు ఆలోచించమని ఓ ఎంపీటీసీ సభ్యురాలిని ఆమె అత్త బతిమిలాడగా.. అవసరమైతే పిల్లోడితో కలిసి చావనైనా చస్తాను కానీ.. జగనన్నకు అన్యాయం చేయనని ఆ ఎంపీటీసీ సభ్యురాలు పేర్కొనడం విశేషం. ఇక వీరిని లొంగదీసుకోవడం కష్టమని భావించిన టీడీపీ నాయకులు అధికారులను తమవైపు తిప్పుకొని రిటర్నింగ్ ఆఫీసర్‌తో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేయించారు. ఇందుకు ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు సహకరించలేదనే నెపం మోపారు.


