పోలింగ్‌ కేంద్రాలపై నివేదిక ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలపై నివేదిక ఇవ్వండి

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

విధులపై పీఓలకు అవగాహన అవసరం

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల స్థితిగతులపై సమగ్ర విచారణతో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు నివేదించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్‌ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు, ఏ కారణాలతో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారో స్పష్టత ఇవ్వాలని కలెక్టర్‌ అన్నారు. ఆ కేంద్రాలు, 400 మంది ఓటర్లకు మించి ఉన్న కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు విద్యుద్ధీకరణ చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలతో వీఆర్వోలు సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని సామాజిక వర్గాలు, మత పెద్దలతో సమావేశమై ఎన్నికలపై అవగాహన పెంచాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర పరిశీలన తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలింగ్‌ కేంద్రాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి పరిశీలించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస వసతులు ఉండాలన్నారు. ఓటర్ల జాబితాను ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద నోటీస్‌ బోర్డ్‌ లో ఉంచాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిశుభ్రంగా ఉండాలని, పెయింటింగ్‌ తప్పనిసరిగా చేయాలని, భద్రతా చర్యలపై నివేదిక పంపాలన్నారు. పంచాయతీలకు ఎన్నికల సామగ్రి తరలించేడానికి సర్వేయర్లు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలన్నారు. ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మూడో దశలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేయగా, పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎన్నికల విధులకు నియమించిన యంత్రంగా గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రిజర్వులో 10% ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు

ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా దరఖాస్తుల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 15 వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై దరఖాస్తులు స్వీకరించడం, పరిష్కరించడానికి అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియ వేగంగా చేపట్టాలని ఆర్డీఓలు, తహసిల్దార్లను ఆయన ఆదేశించారు. డిసెంబర్‌ 22వ తేదీన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ, డీపీఓ నగేష్‌ కుమారి, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను పీఓలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. గురువారం బాపట్ల ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్‌న్స్‌ కళాశాలలో ప్రిసైడింగ్‌ అధికారులకు నిర్వహించిన రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026లో భాగంగా ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నియమితులైన ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓలు) తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.కార్యక్రమంలో డీపీఓ నగేష్‌కుమారి, డ్వామా పీడీ ఏ.వి.విజయలక్ష్మి, స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు జిల్లా అధికారి రాజేష్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌, ఎన్నికల విధులకు నియమితులైన ప్రిసైడింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement